DK Shivakumar : ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే తనపై స్టింగ్ ఆపరేషన్ (Sting Operation) జరిగిందని కర్ణాటక సీఎం (Karnataka CM) డీకే శివకుమార్ (DK Shivakumar) సంచలన ఆరోపణలు చేశారు. తనను స్టింగ్ ఆపరేషన్లో ఇరికించేందుకు కుట్ర జరిగిందని అన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు (Photos), పత్రాలు (Documents) తన వద్ద ఉన్నాయని, ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో తనకు తెలుసని చెప్పారు.
ఢిల్లీలో ఇవాళ (గురువారం) మీడియాతో మాట్లాడిన శివకుమార్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు వ్యక్తులు తనను కలిశారని చెప్పారు. వారెవరో, ఎవరి కోసం వచ్చారో తనకు తెలుసన్నారు. తనను ఇరికించేందుకు ప్రయత్నం చేశారని, తన వద్ద ఫొటోలు ఉన్నాయని చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్లు శివకుమార్ వెల్లడించారు. తనను కలిసిన వ్యక్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను భద్రపరిచినట్లు తెలిపారు.
అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే బయటపెట్టలేనని డీకే అన్నారు. ‘వాళ్లు ఏం మాట్లాడేందుకు వచ్చారు..? ఎలా వచ్చారు..? ఎవరిని కలిశారు..? అనే విషయాలు అన్నీ తనకు తెలుసని చెప్పారు. దీని వెనుక ఎవరు ఉన్నారో కూడా తెలుసని అన్నారు. ప్రభుత్వ అధికారులను కూడా ఇలాంటి ఉచ్చుల్లోకి లాగవచ్చని హెచ్చరించిన ఆయన.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తన చుట్టూ మూడు స్థాయుల్లో వ్యక్తులు ఉంటారని, కొందరిని ప్రత్యేకంగా నియమించినట్లు తనకు సమాచారం ఉందని ఆరోపించారు. తనపైనే కాకుండా మరికొందరిపైనా స్టింగ్ ఆపరేషన్లు జరుగుతున్నాయని శివకుమార్ ఆరోపించారు. వాటి వెనుక ఎవరు ఉన్నారు..? వాటికి నిధులు ఎవరు సమకూరుస్తున్నారు..? అన్న సమాచారం తన వద్ద ఉందని చెప్పారు. తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని స్పష్టంచేశారు.