Bihar Couple : ఇటీవల వైరల్ అయిన రష్యా జంటను చూసి స్ఫూర్తి పొందిన ఒక జంట.. తమ లవ్ ప్రపోజల్ కోసం బిహార్‌లో ఎలక్ట్రిక్ టవర్ ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే, పోలీసులు జోక్యం చేసుకుని, టవర్ ఎక్కి వారికి అడ్డుచెప్పడంతో ఇద్దరూ కిందికి దిగారు. ఈ ఘటన ఇటీవల బిహార్‌లో జరిగింది. దినికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల రష్యాకు చెందిన ఒక జంట తమ ఫేస్‌కు మాస్కులు ధరించి, అమెరికా, న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక ఎంపైర్ స్టేట్ బిల్డింగులో ఉన్న టవర్ ఎక్కింది.
అక్కడ వారు లవ్ ప్రపోజ్ చేసుకుని, రింగులు తొడుక్కున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రపంచవ్యాప్తంగా అది వైరల్ అయింది. దీనికి చాలామంది వారిని అభినందించారు. అయితే, ఈ వీడియో చూసి బిహార్‌లోని ఒక జంట కూడా స్ఫూర్తి పొందింది. దీంతో వారు కూడా ఇలాగే ఒక టవర్ ఎక్కి తమ లవ్ ప్రపోజ్ చేసి, అక్కడే రింగులు మార్చుకోవాలనుకున్నారు. ఈ ఘటన బిహార్‌లో ఎక్కడ జరిగిందో స్పష్టమైన వివరాలు లేవు. అయితే, తమ లవ్ ప్రపోజల్ కోసం ఈ జంట ఒక పెద్ద ఎలక్ట్రిక్ టవర్ ఎక్కేందుకు ప్రయత్నించింది. ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి, అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఈ జంట టవర్‌పై చాలా ఎత్తుకు వెళ్లింది. నిజానికి ఇది చాలా ప్రమాదకరం. అంత ఎత్తునుంచి పొరపాటున పడితే అంతే సంగతులు. పైగా ఇది హైటెన్షన్ ఎలక్ట్రిక్ టవర్. అందువల్ల మరింత రిస్క్. దీంతో పోలీసులు ఆ జంటను రక్షించడం కోసం వారు కూడా టవర్ ఎక్కారు.
ఆ జంట దగ్గరకు చేరుకుని, వారికి నచ్చజెప్పారు. ఇద్దరినీ సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. ఈ అంశంపై పోలీసులు స్పందించారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అయినవాటిని రీ క్రియేట్ చేయడం కోసం ప్రాణాలు రిస్క్ చేయాల్సిన అవసరం లేదని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా బిహార్ జంట చేసిన పనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.