జనవరి 25 నుంచి దేశవ్యాప్త జనగణన
దేశవ్యాప్తంగా 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికలు జరగనున్న రాష్ర్టాలు, మంచు ప్రభావిత ప్రాంతాలకు ఈ షెడ్యూల్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
- ఎన్నికల రాష్ర్టాలు, మంచు ప్రభావిత ప్రాంతాలకు మినహాయింపు
- మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలు ప్రామాణిక తేదీగా నిర్ణయం
- జనవరి 10 నుంచి స్వీయ గణన కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్
న్యూఢిల్లీ, అక్టోబర్ 30 : దేశవ్యాప్తంగా 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికలు జరగనున్న రాష్ర్టాలు, మంచు ప్రభావిత ప్రాంతాలకు ఈ షెడ్యూల్ నుంచి మినహాయింపు ఇచ్చారు. జనగణనకు 2027 మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలను ప్రామాణిక తేదీగా నిర్ణయించారు. రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృతుంజయ్ కుమార్ నారాయణ్ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. మణిపూర్ (తదుపరి ప్రకటన వెలువడే వరకు), గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లోని మంచు ప్రభావిత ప్రాంతాలు మినహా మిగిలిన రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన చేపడుతారు.
జనవరి 10 నుంచి స్వీయగణన
ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభానికి ముందు జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలకు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఎవరూ లెక్కింపులో మిగిలిపోకుండా చూసేందుకు మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక రివిజన్ రౌండ్ నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ర్టాల్లో జనగణన షెడ్యూల్‌పై మినహాయింపులు ప్రకటించారు.
95 ఏండ్ల తర్వాత కులగణన
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో చేపడుతున్న ఎనిమిదో జనగణన ఇది. మొత్తం ప్రక్రియను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ అయిన ఇళ్ల జాబితా తయారీ ప్రక్రియ 2026 జూన్‌లో పూర్తయింది. రెండో దశలో జనాభా లెక్కింపు చేపడతారు. ఇందులో మొత్తం 40 ప్రశ్నలు అడుగుతారు. అత్యంత కీలకమైన పరిణామం ఏంటంటే.. 95 ఏండ్ల విరామం తర్వాత, అంటే 1931 అనంతరం తొలిసారిగా కులాల వారీగా జనాభాను లెక్కించనున్నారు. ప్రతి పదేండ్లకు ఒకసారి నిర్వహించాల్సిన జనగణనను 2021లోనే చేపట్టాల్సి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడింది. 2027 జనగణన నిర్వహణ కోసం కేంద్ర మంత్రివర్గం రూ.11,718 కోట్లను ఆమోదించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద జనాభా లెక్కింపు కార్యక్రమంగా ఇది నిలువనుంది.
2011లో 121 కోట్ల జనాభా
దేశంలో చివరిసారిగా 2011లో జనగణన నిర్వహించారు. అప్పటికి దేశ జనాభా 121 కోట్లుగా నమోదైంది. ఇందులో పురుషులు 62.32 కోట్లు కాగా, మహిళలు 58.75 కోట్లు. దేశవ్యాప్తంగా మొత్తం 24.95 కోట్ల కుటుంబాలు ఉన్నట్టు ఆ లెక్కల్లో వెల్లడైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

