పాలక్కాడ్: గగన్‌యాన్ మిషన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాములను ఇటీవల ప్రధాని మోదీ దేశానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆస్ట్రోనాట్స్ కు డైట్(Astronauts Diet) ప్లాన్ ఇచ్చింది హైదరాబాద్‌లోని ఎన్ఐఎన్ డాక్టర్లు. ఆ వ్యోమగాములు ఏం తినాలో, ఏం తినొద్దో, ఎంత తినాలో లాంటి విషయాల్ని ఆ డాక్టర్లే చెప్పారు. అయితే గగన్‌యాన్ టీమ్ లీడర్ ప్రశాంత్ నాయర్‌ది కేరళలోని పాలక్కాడ్‌లో ఉన్న నేన్మారా గ్రామం అన్న విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రోనాట్స్‌కు డైట్ ప్లాన్ చేసిన డాక్టర్ నాన్దీప్ది కూడా అదే గ్రామం కావడం విశేషం.
గగన్‌యాన్‌కు శిక్షణ పొందుతున్న ఆస్ట్రోనాట్స్ చాన్నాళ్ల నుంచి డైట్ ప్లాన్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ ఆ వ్యోమగాములకు డైట్ ప్లాన్ చేసింది. డాక్టర్ నాన్దీప్ .. ఎన్ఐఎన్లోనే పనిచేస్తున్నారు. మిషన్ కమాండ్ ప్రశాంత్ నాయర్, ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ ఈఆర్ నాన్దీప్.. ఈ ఇద్దరిదీ నేన్మారా గ్రామం కావడం గమనార్హం.
శిక్షణ సమయంలో శరీర బరువు ఆధారంగా ఆస్ట్రోనాట్స్‌కు డైయిట్ రికమెండ్ చేశారు. వారికి ఇచ్చిన మెనూలో ఇండియన్, కాంటినెన్టల్ స్టయిల్ శాఖాహార, మాంసాహార డిష్‌లు ఉన్నాయి. పప్పులు,పండ్లు కూడా ఆ జాబితాలో ఉన్నాయి. అంతరిక్ష ప్రయోగాల్లో పాల్గొనే వ్యోమగాములు తమ బాడీ వెయిట్‌ను కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ, మిషన్ అమలు సమయంలో శరీర బరువును అదుపు చేయడం తప్పనిసరి.
మైసూరుకు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసర్చ్ ల్యాబ్.. ఆస్ట్రోనాట్స్‌కు మెనూను తయారు చేస్తున్నది. ఆస్ట్రోనాట్స్‌కు కావాల్సిన శక్తికి తగ్గ ఆహారాన్ని అందిస్తోన్నది. కొన్ని వారాల పాటు నిల్వ చేసే సామర్థ్యం ఉన్న రెఢీ టు ఈట్ ఫుడ్ ప్యాకెట్లను వ్యోమగాములు తీసుకెళ్లనున్నారు. ఒకసారి వ్యోమగాములు మళ్లీ భూమ్మీదకు వచ్చిన తర్వాత.. వాళ్లు ప్రత్యేకమైన మెనూ ప్లాన్‌ను ఫాలో కావాల్సి వస్తుంది.
డైయిటీషియన్ డాక్టర్ నాన్దీప్ తండ్రి ఈవీ రమేశ్.. కేరళ విద్యాశాఖలో పనిచేశారు. ఆయన రిటైర్ అయ్యారు. తల్లి గీత స్థానిక పంచాయతీ ఆఫీసులో క్లర్క్‌గా చేశారు. ఆస్ట్రోనాట్స్‌కు డైట్ ప్లాన్ ఇచ్చిన ఎన్ఐఎన్న డాక్టర్లలో డైరెక్టర్ డాక్టర్ ఆర్ హేమలలిత, సైంటిస్ట్ డాక్టర్ కే వెంకటేశ్, న్యూట్రిషియనిస్ట్ జీ వెన్నిలా, నీరజ ఉన్నారు.