Wedding Reception in Metaverse |మెటావర్స్ అనే పదం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వర్చువల్ రియాల్టీని, ఆగ్యుమెంటెడ్ రియాల్టీని సుసాధ్యం చేస్తుంది మెటావర్స్. వర్చువల్‌గా ఇంట్లో కూర్చొని ప్రపంచమంతా చుట్టిరావచ్చు. వర్చువల్ రియాల్టీలోనే ఇది సరికొత్త టెక్నాలజీ. కోవిడ్ వల్ల ప్రపంచమే స్థంభించిపోవడంతో వెంటనే లైమ్ లైట్లోకి వచ్చింది మెటావర్స్.
కరోనా మహమ్మారి తర్వాత చాలామంది కపుల్స్ వర్చువల్‌గా పెళ్లి చేసుకున్నారు. అతిథులు కూడా వర్చువల్‌గానే పెళ్లిళ్లకు అటెండ్ అయ్యారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ జంట తమ వెడ్డింగ్ రిసెప్షన్‌ను వర్చువల్‌గా చేసుకోబోతోంది. ఫిబ్రవరి 2022లో దినేశ్, నందిని అనే జంట పెళ్లి చేసుకోబోతోంది. కానీ.. ఇది కరోనా సమయం కావడంతో అతిథులు వస్తారో రారో అని పెళ్లి తర్వాత సాయంత్రం మెటావర్స్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
తమ రిసెప్షన్‌ను ఇలా మెటావర్స్‌లో ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. పెళ్లి కూతురు తండ్రి ఇటీవల మరణించాడు. దీంతో ఆయన ఆశీర్వాదం ఎలాగైనా తీసుకోవాలని.. వర్చువల్‌లో ఆయన అవతార్‌ను సెట్ చేయించారు. అంటే.. పెళ్లి కూతురు, పెళ్లికొడుకుతో పాటు మెటావర్స్‌లో పెళ్లికూతురు చనిపోయిన తండ్రి కూడా ఉంటాడు. ఫిబ్రవరి 6న పెళ్లి తర్వాత సువలింగపురంలోనే రిసెప్షన్ కూడా ఉంటుందని.. అక్కడికి అటెండ్ కాలేని వాళ్ల కోసమే.. మెటావర్స్ రిసెప్షన్ ఏర్పాటు చేశామని పెళ్లి కొడుకు దినేశ్ చెప్పుకొచ్చాడు.