నాగ్‌పూర్ : ప్రియుడి కారణంగా గర్భం దాల్చిన ఓ బాలిక యూట్యూబ్‌లో వీడియోలు చూసి తనకు తానే అబార్షన్ కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నది. కుటుంబీకులు ఆసుప్రతికి తరలించగా.. చికిత్స పొందుతుండగా.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు బాలిక ప్రియుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్ నార్ఖేడ్ తాలూకాకు చెందిన 17 సంవత్సరాల బాలికకు రెండేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన 27 సంవత్సరాల యువకుడితో పరిచయం ఏర్పడింది.
ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. గత ఏడాది కిందట యువకుడికి నాగ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో ఐఎండీసీ ప్రాంతంలోని ఓ గదిలో నివాసం ఉంటున్నాడు. కొద్ది రోజుల కిందట సదరు యువతి నార్ఖేడ్ నుంచి నాగ్‌పూర్ వెళ్లి యువకుడితో పాటు అతని గదిలోనే ఉన్నది. ఈ సమయంలో ఇద్దరు పలుసార్లు శారీరకంగా దగ్గరయ్యారు. గత కొద్ది రోజులుగా వికారం, వాంతులతో బాధపడుతోంది. ఇదే సమయంలో గర్భవతి అని తెలిసి భయాందోళనకు గురైంది. విషయాన్ని వెంటనే ప్రియుడికి చెప్పింది. అతడు ఆసుపత్రిలో పని చేస్తున్నందున ఆమెకు కొన్ని మందులు ఇచ్చాడు.
ఇందులో కొన్నింటిని యువతి తీసుకున్నది. అయినా.. అబార్షన్ కాకపోవడంతో ఎలా చేయాలో తెలుసుకునేందుకు యూట్యూబ్‌లో చూసింది. నాలుగు రోజుల కిందట ఇంట్లో అబార్షన్ కోసం ప్రయత్నించింది. ఈ సమయంలో అబార్షన్ కావడంతో పసిపాప నేలపై పడిపోయింది. సదరు బాలిక.. తల్లిదండ్రులు వెంటనే కూతురితోపాటు పసికందును ఆసుప్రతికి తరలించారు. ఇప్పటికే పసికందు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలికు వైద్యం అందిస్తుండగా.. చికిత్స పొందుతున్నది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాలిక ప్రియుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.