సాగుబాటలో లావణ్య పాఠం
‘నేలతల్లి సారం పెంచితే.. ఆ భూదేవి మన ఆకలి తీరుస్తది’ అంటున్నది రైతు కొసిరెడ్డి లావణ్య. ఆమె ఎవుసంలోకి దిగిన తొలినాళ్లలో సాగు దండగ అనిపించింది. ఆరుగాలం శ్రమించినా అప్పులే మిగిలేవి! పురుగు మందులు, విత్తనాల అప్పులు పంట చేతికొచ్చేనాటికి తడిసి మోపెడయ్యేవి. ఆ బాధలు భరించలేక కొంత భూమిని అమ్ముకున్నది. ఎక్కడ తప్పు జరుగుతున్నదో తెలుసుకుని ప్రకృతి వ్యవసాయ పాఠాలు విన్నది.
‘నేలతల్లి సారం పెంచితే.. ఆ భూదేవి మన ఆకలి తీరుస్తది’ అంటున్నది రైతు కొసిరెడ్డి లావణ్య. ఆమె ఎవుసంలోకి దిగిన తొలినాళ్లలో సాగు దండగ అనిపించింది. ఆరుగాలం శ్రమించినా అప్పులే మిగిలేవి! పురుగు మందులు, విత్తనాల అప్పులు పంట చేతికొచ్చేనాటికి తడిసి మోపెడయ్యేవి. ఆ బాధలు భరించలేక కొంత భూమిని అమ్ముకున్నది. ఎక్కడ తప్పు జరుగుతున్నదో తెలుసుకుని ప్రకృతి వ్యవసాయ పాఠాలు విన్నది. సేంద్రియ సాగు బాటపట్టి పోగొట్టుకున్న భూమిని మళ్లీ కొన్నది. ఇంకెంతో భూమిని కౌలుకు చేస్తూ ప్రయోగాలతో లాభాలు పండించింది. ఎన్నో అవార్డులు గెలిచింది. అంతకు మించి వేల మంది రైతులకు సాగు పాఠాలు చెప్పింది. ఆ పాఠం నాకూ చెప్పమని గణతంత్ర వేడుకల్లో ఎట్ హోమ్ విందుకు పిలిచిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అడిగింది. అప్పుడు.. సేంద్రియ రైతు కొసిరెడ్డి లావణ్య చెప్పిన స్వగతం ఇది!

మా నాన్న ఆర్టీసీ కండక్టర్. ఇంటి బాధ్యతల కోసం ఉద్యోగం మానేసి వ్యవసాయం చేస్తున్నడు. నేను అమ్మమ్మ వాళ్ల తాన పెరిగిన. వాళ్లు గూడ వ్యవసాయం చేసేది. అమ్మమ్మ గారి ఊరు అల్లాపూర్. ఆడనే సదివిన. స్కూల్లో బాగానే సదివేది. మా మేనమామ తెలుగు పండిట్. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ జాబ్ చేస్కుంటనే వ్యవసాయం చేస్తున్నడు. మా మామయ్య చెప్పినా మా తాతయ్య వినకుండా పెండ్లి చేశిండు. పదో తరగతితోనే నా చదువు ఆగిపోయింది.
రోహిణి కార్తెలో పెండ్లయింది. పెండ్లయిన వారం రోజులకే వాన బాగా పడ్డది. మా ఆయన వెంకట రమణారెడ్డి జొన్నలు వేయడానికి విత్తనం గొర్రు ఎత్తుకుని పొలానికి పోయిండు. ఆయనతోపాటు నేనూ పొలం పనులకు పోయిన. నాకు అప్పటికి వ్యవసాయం గురించి పెద్దగ తెల్వకపోయేది. చిన్నగ నేర్చుకున్న. ఒక సంవత్సరం వంద క్వింటాళ్ల పత్తి, ఇరవై క్వింటాళ్ల ఆముదాలు, పది క్వింటాళ్ల కందులు పండినయి. వాటన్నిటినీ అమ్మినం. పెట్టుబడి పోను మాకు పదకొండు రూపాయలు మిగిలినయి. మా కష్టమంతా ఏమైనట్టు? అప్పటికే అప్పులున్నయ్. పంట చేతికొచ్చినా మిగిలింది లేదు. కాబట్టి అప్పులు తీర్చనీకి ఎకరం తొమ్మిది వేలు చొప్పున పది ఎకరాల పొలం అమ్మినం. అప్పుడు ఇట్లయితే ఎట్ల.. ఎక్కడికన్నా పోయి ఏదన్నా చేసుకుందామని మనసుల పడ్డది. తర్వాత ఏడికి పోవద్దు. ఈడనే ఇంకేదన్నా చేద్దామనుకున్నం.
కనకం పండించిన కనకాంబరం
స్వచ్ఛంద సంస్థ గ్రామ భారతి రైతుల కోసం పొలం బడి నడిపేది. అందులో రైతులకు కొత్త సంగతులు ఎన్నో చెప్పేది. గ్రామ భారతి వాళ్లతో కలిసి వ్యవసాయ అధికారి స్తంభాద్రి రెడ్డి మా ఊరు కార్వంగ (తెల్కపల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా) వచ్చిండు. ఆయన రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండ వ్యవసాయం చేయొచ్చని చెప్పిండు. ఇన్ని బస్తాలు యూరియా, డీఏపీ వేస్తే పండని పంట ఎట్ల పండుతుందని మొదట్లో మేం కూడా అనుకున్నం. అందుకే కొద్ది జాగలోనే సేంద్రియ సేద్యం మొదలుపెట్టినం. మంచిగుంటే మిగతాది తర్వాత చేయొచ్చనుకున్నం. రెండు గుంటల జాగలో కనకాంబరాలు వేసినం. పాలెంలో ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రంలో వర్మి కంపోస్ట్, వర్మి వాష్, వేప నూనె కొనుక్కొచ్చినం. ఆవు మూత్రం, ఆవు పేడతో సాగు చేయడం మొదలుపెట్టినం.
పదేండ్ల కింద… రైతులకు ప్రకృతి వ్యవసాయం గురించి శిక్షణ ఇయ్యడానికి సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరం నిర్వహించిండు. హైదరాబాద్ వచ్చి అయిదు రోజులు వాళ్లు చెప్పింది విన్న. ఒక్క ఆవుతోని ముప్పై ఎకరాల వ్యవసాయం చేయొచ్చని పాలేకర్ గారు చెప్పిండు. ఒక చెట్టుకు ఒక టేబుల్ స్పూన్ పశువుల పేడ వేస్తే కొన్ని వేల కోట్ల సూక్ష్మ జీవులు భూమిలో పెరిగి మొక్కకు సరిపోయే బలాన్నిస్తయని చెప్పిండు. ప్రతి రోజు ఒక ఆవు పది కేజీల పేడ, పది లీటర్ల మూత్రం ఇస్తుందని, అది ఎకరానికి సరిపోతదని, రోజుకు ఒక ఎకరానికి వేస్తూ నెలలో ముప్పై ఎకరాలకు ఎరువు వేసుకుని భూసారం పెంచుకోవచ్చని పాలేకర్ చెప్పిండు. ఆయన మాటలు వినొచ్చిన తర్వాత… సేంద్రియ సాగుతోపాటు దేశీ విత్తనాలతోనే పంటలు వేయాలనుకున్నం. మహారాష్ట్ర పోయి దేశీ మిరప విత్తనాలు కొన్నం. అప్పుడు ఆ విత్తనాలు కొనడానికి డబ్బుల్లేకపోతే అప్పు చేసినం. అర ఎకరంలో మిర్చి వేసినం.

నవ్వినోళ్లని నవ్వనీ
ఆవు లేదు. ఎద్దు లేదు. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఆవు పేడ, ఆవు మూత్రమే కావాలె. వాటి కోసం మా ఆయన పాత స్కూటర్ మీద పక్కూరి నుంచి మూత్రం తీసుకువస్తుండేది. అది చూసి జనం నవ్వేది. ‘ఈ రమణా రెడ్డి అప్పుతీర్చడు. ఉన్న మిగతా భూమి కూడా అమ్ముతడు. వాళ్ల నాయన జీతం డబ్బులు కూడా దీనికే పెడుతడు’ అని జనం అనుకునేది. అప్పుడు ఊర్ల నుంచి వెలివేసినంత పని చేసినరు. జనం మాటలు విని మా మామయ్య ‘ఇంగేం జేస్తం. వ్యవసాయం వద్దు. బంద్ చేయ్. ఊళ్లో ఉండొద్దు. ఎక్కడకన్నా పోయి బతకండి’ అన్నడు. మేం ఎక్కడ పోగొట్టుకున్నమో అక్కడనే వెతుక్కోవాల్నని పట్టుదలతో ఉన్నం. రైతు బాల్‌రెడ్డి ఒక ఆవుని మాకు ఫ్రీగా ఇచ్చిండు. దాని నుంచి దేశీ ఆవుల సంతతి పెంపు చేసుకున్నం.
పోగొట్టుకున్న చోటే
మిర్చి బాగనే పండింది. కానీ రేటు లేదు. కొనే దిక్కు లేదు. నేచురల్ ఫార్మింగ్ చేసినమంటే కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి మేమే మా మిర్చిని తీస్కపోయి బేరగాళ్లకు చూపించినం. నీటుగా ఉందని. నిగనిలాడుతున్నదని వంద రూపాయలు ఎక్కువకు కొన్నరు. వేరే రైతుల పంట కంటే ఎక్కువ రేటుకు కొనేసరికి మాకు ధైర్యమొచ్చింది. అర ఎకరంతో మొదలుపెట్టి పెంచుకుంట పోయినం. ఇందులో కంది, నువ్వులు అంతర పంటగా వేసినం. అట్లనే మిర్చిలో ఆవాలు, ధనియాలు, మెంతులు అంతర పంటలుగా వేసేటోళ్లం. అట్లనే సాగు భూమి పెంచుకుంట పోయినం.
మేం అమ్ముకున్న భూమిని మళ్లీ మేమే కొనుక్కున్నం. ఆ రైతు మేం గతంలో చేసినట్టే రసాయన వ్యవసాయం చేసి అప్పుల పాలైండు. మేం సేంద్రియ సాగుతో లాభపడ్డం. ఆ డబ్బుతోని మా భూమిని ఎకరం తొమ్మిది లక్షల చొప్పున కొనుక్కున్నం. అట్ల మా సొంత భూమిని ముప్పై ఎకరాలకు పెంచుకున్నం. మరో నలభై ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నం. ముప్పై రకాల పంటల్ని సేంద్రియ సాగులో పండిస్తున్నం. వీటికి కషాయాల తయారీ, ఎరువు కోసం పశువులు పెంచుకుంటున్నం. మా గోశాలలోనే అన్ని రకాల కషాయాలు తయారు చేసుకుంటున్నం. వీటి కోసం ముగ్గురు పాలేర్లున్నరు. కోతల కాలంలో ఓ ముప్పై మంది కూలివాళ్లు నెల రోజులపాటు మాతో కలిసి పని చేస్తున్నరు.

భూమి పాఠాలు
పంటలు పండిస్తూ.. వాటిని సొంతంగా అమ్ముకుంటూనే రైతు శిక్షణలకు కూడా పోయేటోళ్లం. మేం ఎట్ల సాగు చేస్తున్నమో వేదికల మీద రైతులకు చెప్పినం. వేరే రైతులు చెప్పింది విని మేం తెలుసుకున్నం. ఇట్ల వ్యవసాయం చేస్తూనే అనుభవాలు పంచుకునేందుకు, నేర్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినం. ఎన్నో ప్రయాణాలు చేసినం. గుంటూరులోని పెల్లటిగుంటలో రైతునేస్తం కేంద్రంలో ప్రతి ఆదివారం క్లాసులు జరిగేది. ఆ రైతు శిక్షణకు ఒక వారం నేను, మరోవారం మా ఆయన పోయేది. కష్టం అనుకోకుండా ఇలా ప్రయాణాలు చేయబట్టే మేమింత మంచి పంటలు పండిస్తున్నం.
విశాఖపట్నం, కర్నూలు, సూర్యాపేటకు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పోయినం. రైతుల దగ్గర పైసా తీస్కోకుండ ప్రకృతి వ్యవసాయం పాఠాలు చెప్పినం. ఒక్క రైతు మారినా అదే చాలనుకున్నం. యూనివర్సిటీలు, గవర్నమెంట్ మీటింగ్‌లకు పోయినం. అక్కడా మా అనుభవాలు చెప్పినం. నా కృషిని గుర్తించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కృషీ రత్న అవార్డు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా రైతు అవార్డు ఇచ్చింది. ఢిల్లీలో నీతి అయోగ్ మీటింగ్‌లో మాట్లాడిన. ఏం చేస్తే రైతులు సేంద్రియ సాగు చేస్తరో వాళ్లు అడిగినరు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆవు, మేతను ఇస్తే ఎంతోమంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తరని చెప్పిన.
సాధికార సేద్యం
కొన్నాళ్లకు మా పంటల్ని మేమే అమ్మడం మొదలుపెట్టినం. రెండు తెలుగు రాష్ర్టాలకు ఆర్టీసీ బస్సులో తిరిగి అమ్మినం. మిర్చిని కారం చేసుకుని పోయేది. ఆవాలు, ధనియాలు, మెంతులు, వాము, సోంపు, కందిపప్పు, పెసర పప్పు, శెనగలు, ఉలువలు, పల్లీలు, బియ్యం అమ్మినం. కారం మిల్లు, పప్పు మిల్లులు కొన్నం. ప్యాకింగ్ సామాగ్రి సమకూర్చుకున్నం. ఊళ్లో అమ్ముతం. ప్రతి రోజూ ఒక ఆర్డర్ డెలివరీ ఇస్తం. రైస్బ్యాగ్, పప్పులు, కుటుంబానికి సరిపోయేటన్ని ప్యాక్ చేసి పంపుతం. హైదరాబాద్ హస్తినాపురంలో ‘ప్రకృతి ఒడి- ఆర్గానిక్’ పేరుతో స్టాల్ కూడా నిర్వహిస్తున్నం.
– నాగవర్ధన్ రాయల
– బందీగే గోపి
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

