ఫ్రెండ్, జీవితభాగస్వామి, ఆత్మీయ బంధువు మన సమక్షంలో ఉన్నా కూడా.. పట్టనట్టు సెల్ఫోన్లో తల దూర్చడమే ఫబ్బింగ్. ఈ ధోరణి బంధాలకు బందూకు లాంటిది. ‘కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్’ పత్రిక తాజాగా ఈ సమస్య తీవ్రతను వివరిస్తూ ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. అయినవారి సమక్షం కంటే సెల్ఫోన్ వినోదానికే మొగ్గు చూపేవారి వైవాహిక జీవితం అంతంతమాత్రంగానే సాగుతుందని నిపుణులు గుర్తించారు.
అలాంటి జంటల బంధానికి బీటలు ఖాయమని హెచ్చరించారు. తల్లిదండ్రులు-పిల్లలు, స్నేహితులు-స్నేహితులు.. ఇలా ఏ బంధాన్ని అయినా ‘ఫబ్బింగ్’ దెబ్బతీస్తుంది. బాధ్యతల నుంచి తప్పించుకోవాలని అనుకునేవారు, ఒంటరితనంతో బాధపడేవారు, ఎదుటివారిని తాము విస్మరిస్తున్నట్టు పరోక్షం చెప్పాలనుకునేవారు, అపరాధ భావంతో కుంగిపోతున్నవారు.. చాలా సందర్భాల్లో ఫబ్బింగ్ను ఆశ్రయిస్తున్నట్టు మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి కారణాలేవీ లేకపోయినా ఆ ఊబిలో పడుతున్నవారూ చాలామందే ఉన్నారు.