US Flight Shutdown | అమెరికాలో విమానాలన్నీ బంద్.. 15 లక్షల మంది ప్రయాణికులకు కష్టాలు! అసలేం జరిగింది?
US Flight Shutdown | అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపంతో వేలాది విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 15 లక్షల మందికిపైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
US Flight Shutdown | ఒక్క కమ్యూనికేషన్ లోపం.. అమెరికా విమానయాన రంగాన్ని కుదిపేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో కమ్యూనికేషన్ వైఫల్యంతో దేశవ్యాప్తంగా వేలాది విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది ప్రయాణికులు గంటలతరబడి విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. నాలుగు గంటలకుపైగా కొనసాగిన ఈ అంతరాయం.. అగ్రరాజ్య విమానయాన వ్యవస్థలో దశాబ్దాల నాటి సాంకేతిక లోపాలను మరోసారి తెరపైకి తెచ్చింది.
అమెరికాలో శుక్రవారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానాశ్రయాలు, విమానాల మధ్య సమాచార మార్పిడికి ఉపయోగించే కమ్యూనికేషన్ నెట్వర్క్ పనిచేయకపోవడంతో విమానాల బయలుదేరే ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. సమస్యకు అసలు కారణమేంటన్నది వెంటనే గుర్తించలేకపోవడంతో నాలుగు గంటలకు పైగా విమాన రాకపోకలను నిలిపివేశారు. అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాలన్నీ ఈ ఆదేశాలను అమలు చేశారు. కొన్ని విమానాలు రన్‌వేపైనే నిలిచిపోగా.. మరికొన్ని విమానాల్లోని ప్రయాణికులను దింపేశారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు.

Us Flights Shutdown1
విమానయాన విశ్లేషణ సంస్థ సిరియం లెక్కల ప్రకారం.. ఈ అంతరాయం ప్రారంభమైన తర్వాత శుక్రవారం సాయంత్రం 4 గంటల ( భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు) నుంచి అమెరికా విమానాశ్రయాల నుంచి సుమారు 11 వేల విమానాలు బయలుదేరాల్సి ఉంది. వీటిలో 15 లక్షల మందికిపైగా ప్రయాణికులు ప్రయాణించాల్సి ఉంది. కానీ ఒక్క సాంకేతిక సమస్యతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
పాత వ్యవస్థే అసలు సమస్య
అమెరికా విమానయాన వ్యవస్థలో దశాబ్దాల నాటి పరికరాలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయని రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ వెల్లడించారు. కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లోని పాత రౌటర్లు, స్విచ్‌లపై అధిక డేటా భారం పడటంతో సమాచారంలో అసమానతలు ఏర్పడ్డాయని వివరించారు. దీంతో విమానాల కదలికలను పర్యవేక్షించే కేంద్రాలకు సరైన సమాచారం అందకపోవడంతో భద్రత దృష్ట్యా విమానాల బయలుదేరడాన్ని నిలిపివేయాల్సి వచ్చిందన్నారు.
కొత్తగా ఏర్పాటు చేసిన పరికరాల్లో ఎలాంటి సమస్య లేదని, పాత పరికరాల వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని చెప్పారు. నెట్‌వర్క్‌పై భారం తగ్గించేలా సాంకేతిక మార్పులు చేపట్టడంతో సమస్య పరిష్కారమైందని వివరించారు. అమెరికా విమానయాన వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునికీకరించేందుకు కాంగ్రెస్ 50 బిలియన్ డాలర్ల నిధులు కేటాయించాలని కోరారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా సమగ్రంగా వ్యవస్థను మార్చాలని సూచించారు.

Us Flights Shutdown3
నాలుగు గంటల తర్వాత గగనతలం ఓపెన్
దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగిన అంతరాయం తర్వాత అమెరికా తూర్పు కాలమానం ప్రకారం రాత్రి 8.15 గంటలకు ( భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 7.45 గంటలకు) గగనతలాన్ని తిరిగి తెరిచినట్లు సీన్ డఫీ ప్రకటించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాలు, వాటికి అనుసంధానమైన వ్యవస్థలు పనిచేయడం ప్రారంభించాయని తెలిపారు. ఎఫ్ఏఏ కూడా దేశవ్యాప్తంగా విధించిన గ్రౌండ్ స్టాప్‌ను ఎత్తివేసింది. దీంతో విమానయాన సంస్థలు తమ సర్వీసులను దశలవారీగా పునఃప్రారంభించాయి. డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాలను సురక్షితంగా తిరిగి నడుపుతున్నట్లు ప్రకటించింది.
అయితే అప్పటికే నిలిచిపోయిన విమానాల కారణంగా ఏర్పడిన రద్దీని తొలగించడానికి సమయం పడుతుందని డఫీ తెలిపారు. విమానాల రాకపోకలపై ఈ ప్రభావం మరికొన్ని రోజులపాటు కొనసాగవచ్చని హెచ్చరించారు. వారాంతంలోనూ విమానాల షెడ్యూళ్లను సరిచేసి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
2023లోనూ ఇదే పరిస్థితి
అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాల బయలుదేరడాన్ని నిలిపివేయడం 2023 జనవరి తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో పైలట్లకు విమాన భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అందించే ఎఫ్ఏఏ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దాదాపు రెండు గంటలపాటు విమానాల బయలుదేరడం నిలిచిపోయింది. ఆ ఘటన కారణంగా 10 వేలకుపైగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు 2025 జులైలో అమెరికా కాంగ్రెస్ 12.5 బిలియన్ డాలర్ల నిధులను ఆమోదించింది. పాతబడిన రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థలను మార్చడం ఈ ప్రణాళికలో భాగం. ఇప్పటివరకు ఎఫ్ఏఏకు చెందిన పాత రాగి తీగల నెట్‌వర్క్‌లో 68 శాతాన్ని హైస్పీడ్ ఫైబర్ నెట్‌వర్క్‌తో భర్తీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే పాత రాగి తీగలను ఫైబర్ కేబుళ్లతో మార్చడం ఒక్కటే సరిపోదని ఎఫ్ఏఏ అధిపతి బ్రయాన్ బెడ్ఫోర్డ్ స్పష్టం చేశారు. మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థను ఆధునికీకరించకపోతే భవిష్యత్తులోనూ ఇలాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Flight Shutdown | అమెరికాలో విమానాలన్నీ బంద్.. 15 లక్షల మంది ప్రయాణికులకు కష్టాలు! అసలేం జరిగింది?
Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు మరో సినిమా.. వకీల్ సాబ్ కాంబో రిపీట్ అవుతుందా?
మద్యం మత్తులో పోలీసుల కారు బీభత్సం.. ట్రాలీని ఢీకొట్టి బాధితులకు బెదిరింపులు!
Ramayana | తమిళనాడులోనూ ‘రామాయణ’ ప్రభంజనం.. సూర్య ‘సీన్’ను మించిన రణ్‌బీర్ సినిమా!
Mission Bhageeratha | కరువు కాలంలో ప్రమోషన్ల వివాదం.. మిషన్ భగీరథలో సీనియర్ల ఇంజినీర్లు గరంగరం!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

