మాస్కో: నల్ల సముద్రంలో తన నౌకల్ని రక్షించుకునేందుకు రష్యా శిక్షణ పొందిన డాల్ఫిన్లను గస్తీ కోసం వాడుతున్నట్లు రిపోర్ట్ వచ్చింది. సెవస్తొపోల్ నావల్ బేస్‌లో డాల్ఫిన్లు పహారా కాస్తున్నట్లు అమెరికా గుర్తించింది. దీనిపై యూఎస్ నావల్ ఇన్స్టిట్యూట్ ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. సెవస్తొపోల్ నౌకాశ్రయం ప్రవేశమార్గం వద్ద రెండు శిక్షణ పొందిన డాల్ఫిన్లు విహరిస్తున్నట్లు అమెరికా నౌకా సంస్థ తన నివేదికలో అభిప్రాయపడింది. శాటిలైట్ దృశ్యాల ఆధారంగా అమెరికా ఈ విషయాన్ని చెప్పింది. అయితే ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఫిబ్రవరిలో డాల్ఫిన్లను అక్కడకు పంపినట్లు అమెరికా అంచనా వేసింది.
న్యూస్‌వీక్ పత్రికలో దీనిపై ఓ కథనం ప్రచురితమైంది. శబ్ధ తరంగాలను గుర్తించే సహజమైన శక్తి డాల్ఫిన్లకు ఉంటుంది కాబట్టి, నౌకాశ్రయ రక్షణ కోసం ఆ డాల్ఫిన్లను రష్యా గస్తీలా వాడుతున్నట్లు అమెరికా తన రిపోర్ట్‌లో చెప్పింది. సముద్రంలో విహరిస్తున్న సమయంలో సాధారణంగా డాల్ఫిన్లు శబ్ధ తరంగాలను ఈజీగా పసికట్టేస్తాయి. శబ్ధ సాంద్రతలో ఉన్న తేడాను కూడా డాల్ఫిన్లు గుర్తించగలవని, వాటికి ఎకోలొకేషన్ అన్న సహజ లక్షణం ఉందని, అందుకే వాటిని నౌకాశ్రయ రక్షణ కోసం వినియోగిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
నల్ల సముద్రంలో ఉన్న రష్యా నౌకలు.. ఉక్రెయిన్ మిస్సైళ్లకు అందనంత దూరంలో ఉన్నాయి. దీంతో అండర్‌వాటర్ అటాక్ జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన రష్యా ముందుగానే ఆ సముద్రంలో శిక్షణ పొందిన డాల్ఫిన్లను వదిలినట్లు తెలుస్తోంది. అయితే నౌకలను దాడుల నుంచి కాపాడే రీతిలో డాల్ఫిన్లకు శిక్షణ ఇస్తారని, అమెరికా కూడా ఇలాంటి తరహా శిక్షణే 1959 నుంచి ఇస్తున్నట్లు న్యూస్‌వీక్ రిపోర్ట్‌లో తేలింది.
అమెరికా తన నౌకల రక్షణ కోసం డాల్ఫిన్లతో పాటు కాలిఫోర్నియా సీ లయన్ అనే జలచరాన్ని వినియోగిస్తోంది. కోస్టల్ ప్రాంతాల్లో ఉండే ప్రమాదకరమైన, మైనింగ్ వస్తుల్ని గుర్తించేందుకు రష్యా తరహాలోనే అమెరికా డాల్ఫిన్లను వాడుతున్నట్లు ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. సెవస్తొపోల్ నౌకాశ్రయంలో చాలా ఖరీదైన నౌకలు ఉన్నాయని, ఆ బేస్ చాలా కీలకమైంది కావడం వల్ల అక్కడ సోవియట్ కాలం నుంచే డాల్ఫిన్లతో భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.