న్యూయార్క్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టి రెండేళ్లవుతోంది. ఇప్పటి వరకూ దీనికి సరైన మందే లేదు. చికిత్సలో ఇప్పటి వరకూ ఏవేవో మందుల కాంబినేషన్లతో దీని తీవ్రతను తగ్గించే ప్రయత్నం డాక్టర్లు చేస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్ల ద్వారా దీని వ్యాప్తిని అరికట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు కొవిడ్ సోకకుండా అడ్డుకునే ఓ యాంటీవైరల్ టాబ్లెట్‌ను ఫైజర్( Pfizer Pill ) సంస్థ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం చివరి దశ క్లినికల్ ప్రయోగాల దశలో ఉన్న ఈ టాబ్లెట్ సమర్థంగా పని చేస్తుందని తేలితే.. ఈ ఏడాది చివరిలోపు మార్కెట్లోకి రానుంది.
ఏంటీ ఫైజర్ టాబ్లెట్?
ఇదొక యాంటీ వైరల్ డ్రగ్. ఓ వ్యక్తిలోకి వైరస్ వెళ్లిన తర్వాత ఆ వ్యక్తికి కరోనా సోకకుండా ఈ డ్రగ్ అడ్డుకట్ట వేయగలదని ఫైజర్ సంస్థ చెబుతోంది. పీఎఫ్-07321332 అనే ఈ డ్రగ్‌ను గతేడాది మార్చి నుంచి అభివృద్ధి చేస్తోంది. ప్రయోగాల్లో భాగంగా దీనిని హెచ్ఐవీ రోగుల కోసం వాడే రిటోనవిర్‌తో కలిపి ఇస్తున్నారు. ల్యాబ్ పరీక్షల్లో ఈ యాంటీవైరల్ డ్రగ్ వైరస్‌ను నియంత్రిస్తున్నట్లు తేలింది. కొవిడ్ ప్రారంభ దశలో ఉన్న వారిపై ఇది సమర్థంగా పని చేసే అవకాశం ఉన్నట్లు ఫైజర్ చెబుతోంది.
క్లినికల్ దశ ప్రయోగాల్లో భాగంగా ఈ యాంటీవైరల్ డ్రగ్ పీఎఫ్-07321332ను రిటోనవిర్‌తో కలిపి వాడుతూ దాని భద్రత, సామర్థ్యాన్ని పరీక్షించి చూశారు. మొత్తం 2660 మంది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులపై ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. వీళ్లలో కొంతమంది ఇన్ఫెక్షన్ బారిన పడిన వాళ్లు కూడా ఉన్నారు.
ఎలా పని చేస్తుంది?
ప్రయోగాల్లో భాగంగా ఇందులో పాల్గొన్న వారికి పీఎఫ్-07321332తోపాటు రిటోనవిర్‌ను ఇస్తారు. వీళ్లలో మూడో వంతు మందికి పెద్దగా ప్రభావం చూపని ఓ ఔషధాన్ని ఇస్తారు. మిగతా వాళ్లకు ఈ పీఎఫ్-07321332 డ్రగ్‌ను రోజూ రెండు పూటలా ఐదు నుంచి పది రోజుల పాటు ఇస్తారు. తొలి దశ ప్రయోగాల్లో ఈ డ్రగ్ పూర్తి సురక్షితమని తేలింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరిలోపు ఈ డ్రగ్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని ఫైజర్ భావిస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచే ఫైజర్ తొలి దశ ప్రయోగాలు ప్రారంభించినట్లు సీఎన్‌బీసీ రిపోర్ట్ వెల్లడించింది.
ఇలాంటి యాంటీవైరల్ డ్రగ్స్‌పై ఫైజర్‌తోపాటు ఇతర కంపెనీలు కూడా పని చేస్తున్నాయి. ఇన్ఫ్లుయెంజాకు టామిఫ్లూ ఎలా పని చేస్తోందో కొవిడ్‌కు ఈ యాంటీవైరల్స్ అలా పని చేసేలా ఈ కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయి. మెర్క్&కంపెనీ, రిడ్జ్‌బ్యాక్ బయోథెరప్యూటిక్స్ ఇప్పటికే మోల్నుపిరవిర్ పేరుతో ఓ డ్రగ్ తయారు చేశాయి. ఇక రోచె అండ్ అటియా ఫార్మాసూటికల్స్ కూడా ఏటీ-527 పేరుతో మరో డ్రగ్ అభివృద్ధి చేశాయి.