(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణకు 15 షరతులతో కూడిన శాంతి ప్రణాళికను ఇరాన్ ముందు ఉంచారు. తమ షరతులకు ఒప్పుకొంటే, ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తేస్తామని, విద్యుదుత్పత్తి ప్లాంట్ల నిర్వహణకు ఆర్థిక సాయం చేస్తామని ప్రతిపాదించారు. అయితే అమెరికా ప్రతిపాదనను సమీక్షించిన ఇరాన్ షరతులు తమకు ఆమోదయోగ్యంగా లేవని స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదనకు తమ ప్రాథమిక స్పందన సానుకూలంగా లేదని, అయినప్పటికీ షరతులపై సమీక్ష కొనసాగుతుందని ఇరాన్ అధికారి ఒకరు రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు.
యుద్ధం ఎప్పుడు ముగించాలో నిర్ణయం తీసుకునే అధికారం ఇరాన్‌కు మాత్రమే ఉందని ఆ అధికారి స్పష్టం చేశారు. యుద్ధం ముగింపు సమయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్దేశించడానికి ఇరాన్ అనుమతించదని ఆయన తెగేసి చెప్పారు. కొన్ని షరతులు పూర్తిగా నెరవేరినపుడు మాత్రమే దాడులను ఆపడానికి అంగీకరిస్తామని ఆయన తెలిపారు. సహజ న్యాయ హక్కు అయిన హొర్ముజ్ జలసంధిపై తమ దేశానికి సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని, యుద్ధ నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారో, చెప్పాలని వంటి కొన్ని కీలక డిమాండ్లను ఇరాన్ తెరపైకి తెచ్చింది.
భవిష్యత్తులో యుద్ధం పునరావృతం కాకుండా పటిష్టమైన హామీలు ఇవ్వాలని, ఈ యుద్ధానికి మాత్రమే కాకుండా ప్రాంతంలోని తిరుగుబాటు బృందాలతో ముడిపడి ఉన్న ఘర్షణలకు కూడా ముగింపు పలకాలని తాము కోరుకుంటున్నట్లు ఇరాన్ తెలిపింది. తమ షరతులు నెరవేరే వరకు తమ ఆత్మరక్షణ చర్యలు కొనసాగుతాయని ఇరాన్ స్పష్టం చేసింది. తమ షరతులకు ఒప్పుకొంటే, బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధి ప్రక్రియను ఐదేండ్లపాటు నిలిపేయడంతో పాటు యురేనియం నిల్వల పెంపును తగ్గించడం, ఐఏఈఏకు పర్యవేక్షణ అధికారాలు అప్పగించడం, ప్రాంతీయ శక్తులకు నిధులను ఇవ్వడాన్ని నిలిపివేయడం వంటి అమెరికా కండీషన్లకు ఒప్పుకొంటామని ఇరాన్ పేర్కొన్నది.
1. ఇరాన్ భూభాగంపై అణుశుద్ధి జరుగకూడదు.
2. ఇరాన్లో ఇప్పటికే ఉన్న అణ్వాయుధ కేంద్రాలను నాశనం చేయాలి.
3. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో పాక్షికంగా ధ్వంసమైన నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్దోలో ఉన్న అణు కేంద్రాలను ఇరాన్ పూర్తిగా నేలమట్టం చేయాలి.
4. అణ్వాయుధాలను ఎప్పటికీ సమకూర్చుకోబోమని ఇరాన్ హామీ ఇవ్వాలి.
5. ఇరాన్ తన దగ్గర ఉన్న 450 కిలోల యురేనియం నిల్వలను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ)కి అప్పగించాలి.
6. హొర్ముజ్ జలసంధిని తెరవాలి.
7. హొర్ముజ్‌ను ఫ్రీ మారిటైమ్ కారిడార్‌గా నిర్వహించాలి.
8. క్షిపణి కార్యక్రమాలను పరిమితం చేయాలి.

9. క్షిపణిల పరిధి, సంఖ్యను తగ్గించుకోవాలి.
10. క్షిపణులను ఏ మేరకు సామర్థ్యంతో వినియోగించుకోవాలో తర్వాత తెలియజేస్తాం. దానికి ఒప్పుకోవాలి.
11. ఆత్మరక్షణ కోసం మాత్రమే క్షిపణులను వినియోగించుకోవాలి.
12. ఇరాన్‌కు సంబంధించిన రక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించే అనుమతులను ఐఏఈఏకు ఇవ్వాలి.
13. ప్రాంతీయ శక్తులతో (హెజ్బొల్లా, హౌతీలు) అంటకాగడాన్ని ఇరాన్ విడిచిపెట్టాలి.
14. ప్రాంతీయంగా తనకు అనుబంధంగా పనిచేస్తున్న వారికి (హెజ్బొల్లా, హౌతీలు) నిధులు, ఆయుధాలు ఇవ్వడాన్ని వెంటనే నిలిపేయాలి.
15. ప్రాంతీయ శక్తులకు ఇరాన్ దిశానిర్దేశం చేయకూడదు.

1. మాపై దాడులు చేయబోమని అమెరికా హామీనివ్వాలి.
2. భవిష్యత్తులో కూడా హొర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉంటుందని హామీ ఇవ్వాలి.
3. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ మూసేయాలి.
4. యుద్ధంలో నష్టపోయిన దానికి పూర్తి పరిహారం చెల్లించాలి.
5. ఈ ప్రాంతంలోని రెసిస్టెన్స్ గ్రూప్‌లపై దాడులను నిలిపివేయాలి.
వాషింగ్టన్, మార్చి 25: మూడు వారాల యుద్ధంలో తామే గెలిచినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అణ్వాయుధాలు ఎన్నడూ తయారు చేయకుండా ఉండేందుకు ఇరాన్ ఒప్పుకొందని, హొర్ముజ్ జలసంధికి సంబంధించి ఓ బ్రహ్మాండమైన బహుమతిని తమకు పంపిందని ట్రంప్ వెల్లడించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమతో ఒప్ప ందం కుదుర్చుకోవడానికి ఇరాన్ ఆసక్తిగా ఉందని చెప్పారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, పశ్చిమాసియాలో ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నారని ఆయన చెప్పారు.

ముందుగానే చెప్పదలచుకోలేదు కాని అణ్వాయుధాల జోలికి ఎన్నడూ వెళ్లబోమని వారు(ఇరాన్) అంగీకరించారు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. హొర్ముజ్ జలసంధి, చమురు ప్రవాహానికి సంబంధించి ఇరానియన్ నాయకత్వం అమెరికాకు ఓ అద్భుతమైన బహుమతి అందచేసింది. వాళ్లు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. నిజానికి మాకు ఓ బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి ఈరోజు చేరింది. అని ట్రంప్ అన్నారు.
టెహ్రాన్, మార్చి 25: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డు కోర్(ఐఆర్జీసీ) అధికార ప్రతినిధి బుధవారం మండిపడ్డారు. అమెరికా తనతో తానే చర్చించుకుంటున్నదని ఆయన ఎద్దేవా చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం ముగించడానికి ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని తాము ఆశిస్తున్నట్లు మంగళవారం ట్రంప్ వ్యాఖ్యానించిన కొన్ని గంటలకే ఇరాన్ నుంచి ఈ స్పందన వెలువడింది.
మీ అంతర్గత సంఘర్షణ స్థాయి మీతో మీరే బేరసారాలు జరిపే దశకు చేరుకుందా? అంటూ ట్రంప్‌ను ఉద్దేశించి ఐఆర్జీసీ అధికార ప్రతినిధి ఇబ్రహిం జోల్ఫాగారి వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. మా లాంటి వ్యక్తులు మీ లాంటి వ్యక్తులతో ఎప్పటికీ కలసి ఉండలేరు అని ఆయన ట్రంప్‌ను ఉద్దేశించి తేల్చేశారు. ఇరానియన్ సాయుధ దళాలతోనే ప్రాంతీయ సుస్థిరత సాధ్యమన్న విషయాన్ని అమెరికా అంగీకరించనంత వరకు అమెరికా పెట్టుబడులు, యుద్ధం ముందునాటి ఇంధన ధరలు తిరిగి రావని ఆయన స్పష్టం చేశారు.