న్యూరాలింక్ బ్లైండ్‌సైట్‌తో అంధులకు చూపు
మెదడులో అమర్చే ప్రత్యేక చిప్‌ల ద్వారా సాంకేతిక విప్లవాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ రెండు కొత్త ఉత్పత్తులను ప్రకటించింది.
- అనుమతుల కోసం ఎదురుచూపులు
- ప్రకటించిన ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ : మెదడులో అమర్చే ప్రత్యేక చిప్‌ల ద్వారా సాంకేతిక విప్లవాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ రెండు కొత్త ఉత్పత్తులను ప్రకటించింది. వీటిలో ఒకటి చూపులేని వారికి తిరిగి చూపును అందించేందుకు రూపొందించిన బ్లైండ్‌సైట్ కాగా, మరొకటి కేవలం ఆలోచనల ద్వారానే కంప్యూటర్లతోపాటు ఇతర వ్యక్తులతో సంభాషించేందుకు ఉపయోగపడే టెలిపతి. బ్లైండ్‌సైట్ సాంకేతికంగా అభివృద్ధి పూర్తిచేసుకున్నదని, ప్రస్తుతం ప్రభుత్వ నియంత్రణ సంస్థల అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని ఎలాన్ మస్క్ తెలిపారు. మరోవైపు టెలిపతి ద్వారా ఆలోచనలతోనే సమాచారాన్ని పంపించుకునే సాంకేతికతను మరింత అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన రెండు పోస్టుల్లో ఈ ఉత్పత్తుల గురించి వివరించారు. ‘న్యూరాలింక్ తొలి ఉత్పత్తి పేరు టెలిపతి. కేవలం ఆలోచనల ద్వారానే కంప్యూటర్లు లేదా మనుషులతో అత్యంత వేగంగా సంభాషించేందుకు ఇది సహాయపడుతుంది’ అని మస్క్ పేర్కొన్నారు. మరికొన్ని సంవత్సరాల్లో మాట్లాడటం లేదా టైప్ చేయడం ద్వారా సాధించే వేగం కంటే ఆలోచనల ద్వారా సమాచారాన్ని పంపించే వేగం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరో పోస్టులో బ్లైండ్‌సైట్ గురించి వివరిస్తూ ‘మా రెండో ఉత్పత్తి పేరు బ్లైండ్‌సైట్. పేరుకు తగ్గట్టుగానే పూర్తిగా అంధులైనవారికి, పుట్టుకతోనే చూపులేని వారికి కూడా చూపును అందించడమే దీని లక్ష్యం’ అని తెలిపారు.
న్యూరాలింక్ బ్లైండ్‌సైట్ అంటే..
బ్లైండ్‌సైట్ అనేది అంధులకు చూపును కల్పించేందుకు న్యూరాలింక్ అభివృద్ధి చేస్తున్న ప్రయోగాత్మక మెదడు ఇంప్లాంట్. కండ్లతో సంబంధం లేకుండా నేరుగా మెదడుకు దృశ్య సమాచారాన్ని పంపించడం ఈ సాంకేతికత ప్రత్యేకత. సాధారణంగా మన కండ్లు కాంతిని గ్రహించి, వాటిని సంకేతాలుగా మార్చి ఆప్టిక్ నర్వ్ ద్వారా మెదడుకు పంపిస్తాయి. మెదడు ఆ సంకేతాలను విశ్లేషించి మనకు దృశ్యాలను చూపిస్తుంది. అయితే కండ్లు లేదా దృష్టి నాడులు దెబ్బతిన్నపుడు ఈ ప్రక్రియ సరిగా పనిచేయదు. ఫలితంగా చూపు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు న్యూరాలింక్ ప్రత్యేక సాంకేతికతను రూపొందిస్తున్నది. ఇందులో ఒక కెమెరా ద్వారా మన చుట్టూ ఉన్న పరిసరాలను చిత్రీకరించి, ఆ సమాచారాన్ని వైర్లెస్ విధానంలో మెదడులో అమర్చిన ప్రత్యేక చిప్‌కు పంపిస్తారు. ఆ చిప్ మెదడులో చూపునకు సంబంధించిన భాగాన్ని ప్రేరేపించడం ద్వారా దృశ్యాలను గుర్తించేలా చేస్తుంది. కండ్లు లేదా దృష్టినాడులు దెబ్బతినడం వల్ల చూపు కోల్పోయినవారికి ఈ సాంకేతికత ఉపయోగపడే అవకాశం ఉన్నది.
న్యూరాలింక్ టెలిపతి అంటే..
టెలిపతి కేవలం ఆలోచనలతోనే కంప్యూటర్లను నియంత్రించడం, ఇతరులతో సమాచారాన్ని పంచుకోవడం లక్ష్యంగా రూపొందించబడింది. ఇది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో మెదడులో ఒక చిన్న చిప్‌ను అమర్చుతారు. ఈ చిప్ మెదడులో ఉత్పత్తయ్యే నాడీ సంకేతాలను గుర్తించి వాటిని డిజిటల్ ఆదేశాలుగా మారుస్తుంది. దీంతో చేతులు కదపకుండానే, కీబోర్డ్ ఉపయోగించకుండానే కేవలం ఆలోచనలతో కంప్యూటర్ కర్సర్‌ను కదపడం, క్లిక్ చేయడం, టైప్ చేయడం వంటి పనులు చేయవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

