న్యూఢిల్లీ: మానవాళి వినాశనం వైపు వేసే ప్రతి అడుగును రికార్డ్ చేయడానికి ‘భూమి బ్లాక్ బాక్స్’ అనే ఒక వింతైన నిర్మాణాన్ని టాస్మానియాలోని ఒక మారుమూల ఎయిర్‌ఫీల్డ్‌లో నిర్మిస్తున్నారు. విమాన ప్రమాదాల డాటాను భద్రపరిచే ఫ్లైట్ రికార్డర్ల(బ్లాక్ బాక్స్) ఆధారంగా దీనిని రూపొందించారు. మానవాళి పతనం ఎలా జరిగిందో భవిష్యత్తు తరాలకు(ఒకవేళ ఎవరైనా బతికి ఉంటే) తెలియజేయడానికి ఇది ఒక నిశ్శబ్ద సాక్షిగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను మొదట 2021లో గ్లాస్గోలో జరిగిన సీవోపీ26 వాతావరణ చర్చల సమయంలో ప్రకటించారు. అయితే గత ఐదేండ్లుగా దీని గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని చాలామంది భావించారు.
మొదట్లో భాగస్వామిగా ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా కూడా దీని నుంచి తప్పుకున్నది. కానీ ప్రస్తుతం అన్ని అడ్డంకులను దాటుకుని దీని నిర్మాణం వేగంగా జరుగుతున్నదని ఆస్ట్రేలియన్ సంస్థ రౌజర్ ల్యాబ్ స్పష్టం చేసింది. డిసెంబర్ 2026 నాటికి టాస్మానియాలోని క్వీన్స్టౌన్ వెలుపల ఈ బ్లాక్ బాక్స్‌ను పూర్తిగా ఇన్స్టాల్ చేయనున్నారు. ఈ బ్లాక్ బాక్స్ నిర్మాణం పూర్తయిన తర్వాత శాస్త్రవేత్తలు, విద్యార్థులు, జర్నలిస్టులు, ప్రజలకు రియల్‌టైమ్ వాతావరణ డాటాను అందించే ఒక వేదికగా మారుతుందని భావిస్తున్నారు. “గ్రహం పతనానికి దారితీసే వివరాలను నిష్పక్షపాతంగా అందించడం, భవిష్యత్తు తరాలకు జవాబుదారీగా ఉంచడం మన చేతుల్లోనే ఉంది” అని భూమి బ్లాక్ బాక్స్ వెబ్సైట్ పేర్కొన్నది.
భూమి బ్లాక్ బాక్స్ అనేది ఇంటర్నెట్ నుంచి డాటాను డౌన్లోడ్ చేసే హార్డ్ డ్రైవ్‌లతో నిండిన నిర్మాణం. 52 అడుగుల (16 మీటర్లు) పొడవు, 13 అడుగుల (నాలుగు మీటర్లు) ఎత్తుతో ఉక్కు, కాంక్రీట్‌తో దీనిని నిర్మిస్తున్నారు. సైక్లోన్లు, భూకంపాలు, మంటలు, వరదలు లేదా దాడులతో సహా ప్రతి విపత్తును ఈ బాక్స్ ఉక్కుగోడలు తట్టుకోగలవని ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఏజెన్సీ రౌజర్ ల్యాబ్ చెబుతున్నది. దీనిపై గ్లాస్‌తో కప్పబడిన 36 సౌర ఫలకాలు, థర్మో-ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ వ్యవస్థ ఉంటాయి.