టెక్సస్, డిసెంబర్ 29: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని వేధిస్తున్న టైప్-1 మధుమేహం చికిత్సలో సమూల మార్పులు తెచ్చేలా అమెరికాలో వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హాస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్ వైద్య బృందం ఒక అధునాతన పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఇది ఒక 3డీ ప్రింటెడ్ పరికరం. దీన్ని బయోఇంజినీర్డ్ పాంక్రియాస్గా చెప్పవచ్చు. టైప్-1 మధుమేహం ఉంటే క్లోమంలో ఇన్సులిన్ తయారుచేసే కణాలు పాడైపోతాయి. దీంతో కృత్రిమంగా ఇంజెక్షన్ల ద్వారా రోజూ ఇన్సులిన్‌ను శరీరానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అవసరాన్ని ఈ పరికరం తీరుస్తుంది. దీన్ని చర్మం లోపల పెడతారు. ఇది శరీరానికి కృత్రిమంగా ఒక సెల్ రిజర్వాయర్‌గా పని చేస్తుంది. ఐలెట్ కణాలను, రోగనిరోధక శక్తిని నేరుగా ఇందులోకి పంపించే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.