Python Cancer Treatment | బ్రిటన్ వైద్యులు అరుదైన వైద్యంతో ఓ కొండచిలువకు ప్రాణం పోశారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న 15 అడుగుల కొండచిలువకు మనుషులకు ఉపయోగించే అధునాతన చికిత్స అందించి నయం చేశారు. దవడలోని ప్రాణాంతక కణితిని తొలగించడంతోపాటు ఎలక్ట్రోకెమోథెరపీ నిర్వహించడంతో క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకుంది. ప్రస్తుతం మళ్లీ చురుగ్గా, ఆరోగ్యంగా ఉన్నట్లు బ్రిటన్‌లోని చెస్టర్ జూ వెల్లడించింది.
ఇంగ్లాండ్‌లోని చెస్టర్ జూలో ఉన్న 23 ఏళ్ల రెటిక్యులేటెడ్ పైథాన్ ‘జోడీ ఫోస్టర్’ ఇటీవల అనారోగ్యానికి గురైంది. సుమారు 50 కిలోల బరువున్న ఈ కొండచిలువ కొంతకాలంగా ఆహారం తీసుకోవడం తగ్గించింది. చురుకుదనం కూడా తగ్గింది. దీంతో జూ సిబ్బంది వైద్య పరీక్షలు చేయగా.. దాని దవడలో ఫైబ్రోసార్కోమా అనే ప్రాణాంతక క్యాన్సర్ కణితి ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ కణితిని తొలగించారు. అయితే కొంతకాలానికి క్యాన్సర్ మళ్లీ తిరగబడింది.
ఈ సారి దవడతో పాటు ఎముకలోకి కూడా క్యాన్సర్ కణితి వ్యాపించడం వైద్యులు గుర్తించారు. దీంతో మరోసారి శస్త్రచికిత్స చేయడం మాత్రమే సరిపోదని వైద్యులు భావించారు. దానికి ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై చెస్టర్ జూ వెటర్నీ బృందం.. యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్ క్యాన్సర్ నిపుణులను సంప్రదించింది. అందరూ కలిసి ఎలక్ట్రోకెమోథెరపీ అనే అధునాతన వైద్య చికిత్సను పాముకు అనుగుణంగా మార్చడం ద్వారా క్యాన్సర్ నయం చేయవచ్చని ఒక అంచనాకు వచ్చారు.

Python Cancer2
ఈ మేరకు మనుషుల్లో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఎలక్ట్రోకెమోథెరపీ విధానాన్ని తొలిసారిగా ఓ పాముపై ప్రయోగించారు. ఈ చికిత్సలో క్యాన్సర్ కణాలపై ప్రభావం చూపే బ్లీమైసిన్ అనే ఔషధాన్ని ఉపయోగిస్తారు. అనంతరం కణితి ప్రాంతంలో నియంత్రిత విద్యుత్ పల్స్‌లను పంపిస్తారు. తద్వారా మిగిలి ఉన్న క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే 15 అడుగుల పొడవు, 50 కిలోల బరువు ఉన్న పాముకు ఆపరేషన్ చేయడం వైద్యులకు మరో సవాల్‌గా మారింది. సాధారణ ఆపరేషన్ టేబుల్ సరిపోకపోవడంతో రెండు టేబుళ్లను కలిపి దాదాపు డబుల్ బెడ్ పరిమాణంలో ఏర్పాటు చేశారు. జోడీకి దాని నివాస ప్రదేశంలోనే మత్తు ఇచ్చారు. అనంతరం ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. ముందుగా క్యాన్సర్ కణితితోపాటు వ్యాధి సోకిన దవడ ఎముక భాగాన్ని తొలగించారు. ఆ తర్వాత ఎలక్ట్రోకెమోథెరపీ ద్వారా మిగిలి ఉండే క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకున్నారు.
చికిత్స జరిగి కొన్ని నెలలు గడిచిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో జోడీ ఫోస్టర్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. దవడలో కొంత భాగాన్ని కోల్పోయినప్పటికీ.. దాని ఆహారం తీసుకునే సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం పడలేదు. వేటాడడంలోనూ ఇబ్బందులు లేవని జూ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జోడీ మళ్లీ మునుపటిలాగే చురుగ్గా, ఉత్సాహంగా ఉందని వెల్లడించారు.