హైదరాబాద్ : నగరంలోని టోలిచౌకీలో సినిమా షూటింగ్‌ను తలపించేలా ఓ రౌడీషీటర్ హల్చల్ చేశాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ పేషెంట్ మెడపై కత్తి పెట్టి హంగామా సృష్టించాడు. కానీ పోలీసులు చాకచక్యంగా ఆ రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
బుధవారం రాత్రి టోలిచౌకీ ఏరియాలో గోల్కొండ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అయితే నాంపల్లికి చెందిన రౌడీషీటర్ ఫరీద్ క్వాద్రీ అటుగా వచ్చాడు. అతను పోలీసులను గమనించాడు. పారిపోయేందుకు రౌడీషీటర్ యత్నించాడు. అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. అటు నుంచి జారుకున్న ఫరీద్.. స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలోకి దూరాడు. పోలీసులు తనను వెంబడించడంతో.. ఆ ఆస్పత్రిలో ఓ రోగి మెడపై కత్తి పెట్టాడు. తనను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే.. రోగి మెడ కోస్తానని రౌడీషీటర్ బెదిరించాడు. అక్కడ గోల్కొండ ఇన్స్పెక్టర్పై దాడికి యత్నించిన రౌడీషీటర్‌ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అంతా సినిమా షూటింగ్‌ను తలపించింది.