సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్‌పై ప్రభుత్వం నిషేధం విధించినా.. కొంతమంది అడ్డదారుల్లో బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ లక్షలు పోగొట్టుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితులను పట్టుకుంటున్నారు. 2017లో రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే వ్యవస్థీకృత నేరాల్లో ఒకటైన పేకాటపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పేకాట, గ్యాంబ్లింగ్ ఆటలకు రాష్ట్రంలో తావు లేకుండా చేసింది. అయితే, ఐపీ అడ్రస్‌లకు మాస్క్ వేసి.. నిషేధిత గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన ఆన్లైన్ గేమ్స్‌ను ఆడుతూ చాలా మంది లక్షలు పోగొట్టుకుంటున్నారు. కొందరు ఆన్లైన్లో పేకాట, ఇతర గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడుతున్నారు. వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీంతో తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన ఐపీ అడ్రస్‌లకు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ పనిచేయవు. రాష్ట్ర సరిహద్దులను పరిగణలోకి తీసుకొని తెలంగాణ భూభాగంలో ఆ ఆన్లైన్ గేమ్స్ ఓపెన్ కావు.
లోకల్ ఐపీలకు..
ఇదిలా ఉండగా.. బెట్టింగ్ గేమ్స్ యాప్‌ల నిర్వాహకులు ఏదోవిధంగా అమాయకులకు వల వేస్తున్నారు. ఇక్కడుండే ఐపీలకు మాస్క్ వేసి, ఫేక్ జీపీఎస్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఆ ఫేక్ జీపీఎస్ యాప్‌లతో గేమ్‌లు ఆడుతూ చాలా మంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వెనక చైనీయుల హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో గతంలోనే వెల్లడయ్యింది. కేంద్రం కూడా ఆన్లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన ప్రకటనలు వెబ్సైట్లలో ఇవ్వకూడదని 2022, జూన్‌లో ఆదేశాలు జారీ చేసింది.
సాధారణ గేమ్స్ మాదిరిగా..
చాలా యాప్‌లు బెట్టింగ్‌ల రూపంలో కాకుండా.. సాధారణ గేమ్స్ మాదిరిగా యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అనుమానం రాకుండా ఆయా యాప్‌లలో అన్ని రకాల గేమ్స్‌ను పొందుపరిచి ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియా, ఇతర వెబ్సైట్లు, మెసేజ్‌ల ద్వారా యువతకు వల వేస్తున్నాయి. ఆయా యాప్‌లను చాలా మంది ఫేక్ జీపీఎస్‌లతో వాడేస్తున్నారు.
ఇదే నిదర్శనం..
తాజాగా.. గత నెలలో షాబాద్‌లోని ఓ రైతు కుటుంబానికి చెందిన యువకుడు భూ పరిహారానికి చెందిన సొమ్ము రూ.98 లక్షలు బెట్టింగ్ యాప్‌ల ద్వారా పోగొట్టుకున్నాడు. దీనిపై విచారణ చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలకు పాల్పడుతున్న భారీ నెట్‌వర్క్‌ను ఛేదించిన విషయం తెలిసిందే. ఆన్లైన్లో గేమ్స్ ఆడకుండా ప్రభుత్వం కట్టడి చేసిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే, పక్కదారిలో ఆడేందుకు ప్రయత్నించినా, ఆడినా అది నేరమే అవుతుందన్నారు.