సిటీబ్యూరో, జనవరి 17(నమస్తే తెలంగాణ):రయ్..రయ్.. మంటూ రోడ్లపై దూసుకెళ్లే రేసింగ్కార్లు ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో పరుగులు పెట్టనున్నాయి. ఫార్ములా 1 కార్ రేసింగ్ గేమ్.. ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన, ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్ రేస్ గేమ్. ఇప్పటి వరకు విదేశాల్లోని మహానగరాలకే పరిమితమై ఫార్ములా వన్ కార్ రేసింగ్ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా జరగనుంది. అంతర్జాతీయ నగరాలైన లండన్, న్యూయార్క్,మెక్సికో, రోమ్, బెర్లిన్, సియోల్,వాంకోవర్ … ఇలా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 18 నగరాల్లో ఫార్ములా 1 రేసింగ్ కార్ల పోటీలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఫార్ములా ఇ రేసింగ్ కార్ల పోటీని నిర్వహించేందుకు ఒప్పందాలు జరిగాయి. ఇందులో కేవలం ఎలక్ట్రిక్ కార్లే రేసింగ్‌లో పాల్గొననున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫార్ములా 1 కార్ రేసింగ్ పోటీలు8 సీజన్లు పూర్తి కాగా, తొమ్మిదో సీజన్‌కు సంబంధించిన పోటీలకు సౌదీ అరేబియాలోని దిరియా నగరం వేదికగా నిలువగా, ఆ తర్వాత నిర్వహించబోయే చాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ మహానగరం వేదికగా మారింది.
ఫార్ములా 1 రేసింగ్ అంటే..
ఫార్ములా వన్ రేసింగ్ నిర్వహించాలంటే ప్రత్యేకంగా ట్రాక్‌తో పాటు కార్ల అవసరం ఉంటుంది. ఇందుకోసం ఆయా నగరాల్లో ప్రత్యేక ప్రదేశాల్లో ట్రాక్‌లను నిర్మించి పోటీలను నిర్వహిస్తారు. అయితే హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న ఫార్ములా ఇ కార్ రేసింగ్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో నిర్వహించనున్నారు. దీంతో ప్రత్యేకంగా రేసింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. నగరంలో అందుబాటులో ఉన్న విశాలమైన రోడ్ల మీదే ఈ రేస్‌ను నిర్వహించవచ్చు. ఇందుకోసం ప్రాథమికంగా నగరంలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న సచివాలయం, ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి ైప్లెఓవర్ ప్రాంతాల్లో రేసింగ్ ట్రాక్‌ను 2.37 కిలోమీటర్ల ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా మరో రెండు ప్రాంతాలను పరిశీలనలోకి తీసుకున్నారు. ఇందులో కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న వలయాకారం రోడ్డు, గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ రోడ్డును పరిశీలించారు.
థాంక్యూ కేటీఆర్..ఆనంద్ మహీంద్రా
ఫార్ములా ఇ కార్ చాంపియన్‌షిప్ రేస్‌ను నిర్వహించేందుకు ముంబై,ఢిల్లీ, బెంగళూరులు కూడా పోటీపడ్డాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవ, స్థానిక పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో చివరకు హైదరాబాద్‌లోనే ఫార్ములా ఇ రేసింగ్‌ను నిర్వహించేందుకు నిర్వాహకులు ముందుకొచ్చారు. దేశంలోని పారిశ్రామిక వేత్తలైన ఆనంద్ మహీంద్రాతో పాటు మరికొందరు సొంతంగా ఫార్ములా వన్ టీమ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి ఎంతో ప్రాధాన్యత ఉన్న పోటీలకు హైదరాబాద్ నగరం అతిథ్యం ఇస్తుండడంతో నగరం బ్రాండ్ ఇమేజ్ మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడి దారులకు గమ్య స్థానంగా ఉన్న హైదరాబాద్ కీర్తి ప్రతిష్టతలు ఫార్ములా ఇ రేసింగ్‌తో మరింతగా పెరిగే అవకాశం ఉంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఒప్పందం విషయాన్ని తెలుసుకున్న ఆనంద్ మహీంద్ర దీనిపై ప్రత్యేకంగా స్పందించారు. ప్రతిష్టాత్మక ఫార్ములా-ఇ వరల్డ్ చాంపియన్‌షిప్ రేస్ కోసం హైదరాబాద్ నగరం వేదిక కావడంతో సొంత రేసింగ్ కార్లను స్వదేశంలో పరుగులు పెట్టించబోతున్నందుకు, తన చిరకాల కల నెరవేర్చేదిశగా అడుగు వేసిన మంత్రి కేటీఆర్‌కు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.