తెలంగాణ గురు మహాదశలో ఆవిర్భవించింది. గురుడి స్వనక్షత్రమైన పునర్వసు 4వ పాదం, కర్కాటక రాశిలో రాష్ట్రం ఏర్పాటు జరిగింది. లగ్నాధిపతి భాగ్యంలో, ధనాధిపతి పంచమ కోణంలో, సప్తమాధిపతి చతుర్థంలో ఉండటం విశేషంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం గోచార రీత్యా గురువు భాగ్య, రాజ్య స్థానాల్లో సంచరించడం వల్ల పాలకులు రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పనులు చేపడతారు. అయితే శని ప్రభావం కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. సామాన్య ప్రజలకు ఉపయుక్తమైన సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. పాలకులు.. కర్షకులకు, కార్మికులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. సంక్షేమం, అభివృద్ధి రెండూ సమర్థంగా ముందుకుసాగుతాయి.
శ్రీ శోభకృత్ నామ సంవత్సర చైత్ర శుక్ల పాడ్యమి మంగళవారం తేది 21-3-2023 రాత్రి 10-54 గంటలకు వృశ్చికలగ్నంలో ప్రవేశించింది. లగ్న, షష్ఠమాధిపతి కుజుడు అష్టమంలో ఉండటంతో ఆకస్మిక ఘటనలు చోటుచేసుకుంటాయి. అధికారులు, పాలకులు ప్రజారోగ్యంపై మనసు నిలుపుతారు. ద్వితీయ పంచమాధిపతి గురువు స్వక్షేత్రంలో ఉండటం వల్ల రాష్ర్టానికి ఆదాయం పెరుగుతుంది. వాణిజ్యరంగం పుంజుకుంటుంది. సరుకులు ఎగుమతి, దిగుమతుల వల్ల ఆదాయం పెరుగుతుంది. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల అభివృద్ధి వేగంగా జరుగుతుంది. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కోసం ప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చిస్తాయి. రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో పయనిస్తాయి. తృతీయ, చతుర్థాధి శని నాలుగింట స్వక్షేత్రంలో ఉండటం వల్ల ప్రజల జీవనశైలిలో అనుకూలమైన మార్పులు కలుగుతాయి. ప్రజల మధ్య ప్రేమాభిమానాలు నెలకొంటాయి. సప్తమ, వ్యయాధిపతి శుక్రుడు అష్టమంలో, రాజ్యాధిపతి రవి, అష్టమ, లాభాధిపతి బుధుడు ఐదింట ఉండటం వల్ల దేశంలోని పశ్చిమ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు తలెత్తవచ్చు. ఉత్తర ప్రాంతంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తూర్పు ప్రాంతంలో మొదటి మూడు నెలలు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి. దక్షిణ భారతంలో మొదటి ఐదు నెలలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ తర్వాత రాజకీయ వాతావరణం పుంజుకుంటుంది. ఆర్థికంగా దక్షిణాది రాష్ర్టాలు బలం పుంజుకుంటాయి.
శ్రీ శోభకృత్ నామ సంవత్సర చైత్ర కృష్ణ నవమి శుక్రవారం తేది 14-4-2023 సింహలగ్న సమయంలో రవి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉచ్ఛంగతుడై ఉండటం శుభప్రదం. ప్రభుత్వం సుస్థిరంగా ఉండి, ప్రజా సంక్షేమంపై దృష్టిసారిస్తుంది. ధన, లాభాధిపతి భాగ్యస్థితిని పొందడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదినాభివృద్ధి చెందుతుంది. వాణిజ్యరంగం పురోగతి సాధిస్తుంది. తృతీయ, రాజ్యాధిపతి దశమ కేంద్రంలో విశేష ఫలితాలు ఇస్తాడు. కళలకు ఆదరణ లభిస్తుంది. కార్పొరేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. చతుర్థ, భాగ్యాధిపతి లాభంలో ఉండటం వల్ల సస్యానుకూల వర్షాలు పడతాయి. ప్రజల్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. పంచమ, అష్టమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ, అష్టమంలో ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు ఇస్తాడు.
ఈ సంవత్సరం తేది 7-6-2023 నుంచి 20-2-2024 వరకు శని, గురువు ఏకాదశ త్రిక (11-3) రాశుల్లో సంచరిస్తున్నారు. దీనివల్ల దేశం మధ్య ప్రాంతం నుంచి శ్రీలంక వరకు ఉన్న ప్రదేశాల్లో వాహన, అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. 22-4-2023 నుంచి 30-10-2023 వరకు గురువు, రాహువు కలిసి ఉండటం వల్ల గురుచండాల యోగం ఏర్పడింది. దీనివల్ల పలువురు ప్రముఖులకు అరిష్టం గోచరిస్తున్నది. 22-4-2023 నుంచి 15-5-2023 వరకు మేషరాశిలో చతుఃగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీంతో ఇరుగుపొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలు ముదిరే అవకాశాలు ఉన్నాయి. 3-10-2023 నుంచి 30-10-2023 వరకు కుజుడు, రాహువు సమసప్తక స్థితిలో ఉండటం వల్ల దేశంలో అంతఃకలహాలు ఏర్పడవచ్చు. పంటలకు నష్టం వాటిల్లవచ్చు. 30-11-2023 నుంచి 24-12-2023 వరకు గురువు, శుక్రుడు సమసప్తక స్థితిలో ఉండటం వల్ల ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతినవచ్చు.
చైత్రం: చైత్రం: ఈ నెలలో వేడిగాలులు అధికంగా వీస్తాయి. రేవతి కార్తె రాకతో వాతావరణం కొంత చల్లబడుతుంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయి. అశ్విని కార్తెలో ఎండలు ఎక్కువగా ఉంటాయి.
వైశాఖం: ఈ నెలలో భరణి, కృత్తిక కార్తెల ప్రబావం ఉంటుంది. ఈ కార్తెల ప్రవేశ సమయాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ఎండల ప్రభావం అధికంగా ఉంటుంది. అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తాయి. రుతుపవనాల ప్రభావం సంతృప్తికరంగా ఉంటుంది.
జ్యేష్ఠం: ఈ మాసం ప్రారంభంలో రోహిణి కార్తె ప్రభావం ఉంటుంది. వర్షాలు కురిసినప్పటికీ ఎండ కూడా ఎక్కువగానే ఉంటుంది. రుతుపవనాలు విస్తరిస్తాయి. మృగశిర కార్తె రాకతో మేఘాడంబరం మొదలవుతుంది. అటవీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి
ఆషాఢం: ఈ నెలలో గ్రహస్థితి ప్రశస్తంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఆరుద్ర కార్తెలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. పునర్వసు కార్తెలో అనుకూల వానలు పడతాయి. రుతుపవనాల ప్రభావం అనుకూలంగా ఉంది.
అధిక శ్రావణం: పుష్యమి కార్తె సమయం బలంగా ఉండటంతో, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. పంటలకు అనుకూలంగా వర్షపాతం నమోదవుతుంది. నదీనదాలు ఉప్పొంగి ప్రవహిస్తాయి. ఆశ్లేష కార్తెలో వాతావరణంలో వేడి పెరుగుతుంది. కొన్నిప్రాంతాల్లో ఎడతెరపిలేని వర్షాలు ఉండవచ్చు.
నిజ శ్రావణం: ఈ నెలలో కార్తెల ప్రవేశ సమయాలు అనుకూలంగా ఉన్నాయి. పంటలకు అనువైన వర్షాలు ఉంటాయి. నదీతీరాలు, కొండ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. నెల మధ్యలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ, మాసాంతంలో సమృద్ధిగా వానలు పడతాయి.
భాద్రపదం: ఈ మాసంలో కార్తెల ప్రభావం, గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వల్ల సస్యానుకూల వర్షాలు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తుంది. మాసం మధ్యలో తుఫాన్లు ఏర్పడవచ్చు. మాసాంతంలోనూ భారీ వర్షాలు ఉంటాయి.
ఆశ్వయుజం: ఈ మాసంలో గ్రహస్థితి, కార్తెల ప్రభావం సామాన్యంగా ఉంది. చిరుజల్లులు కురుస్తాయి. మేఘాడంబరం ఉంటుంది. వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో కురవకపోవచ్చు. మాసాంతంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
కార్తికం: ఈ మాసంలో అనూరాధ కార్తె ప్రవేశ సమయం బాగుండటంతో అనుకూల వర్షాలు ఉంటాయి. పంటలకు అనుకూల వాతావరణం ఉంటుంది. చలి తీవ్రత పెరుగుతుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
మార్గశిరం: ఈ మాసంలో కార్తెల ప్రభావం, గ్రహస్థితి అనుకూలంగా ఉంది. తేమతో కూడిన గాలులు వీచే అవకాశం ఉంది. చలి తీవ్రత అధికమవుతుంది. మాసాంతంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పుష్యం: ఈ నెలలో చలిగాలులు ఎక్కువగా ఉంటాయి. మాసం మధ్యలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాత్రి వేళల్లో చలి ప్రభావం కొనసాగుతుంది.
మాఘం: ఈ మాసంలో వాతావరణం సమశీతోష్ణంగా ఉంటుంది. ఎండల ప్రభావం క్రమంగా పెరుగుతుంది. వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు అధికమవుతాయి.
ఫాల్గుణం: ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి. వేడి గాలులు పెరుగుతాయి. కొన్నిచోట్ల గాలివాన బీభత్సం సృష్టించవచ్చు. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం చైత్ర కృష్ణ నవమి శుక్రవారం తేది 14-4-2023 పగలు 2-58 గంటలకు శ్రవణా నక్షత్రం రెండో పాదం మకర రాశి ప్రయుక్త సింహ లగ్నంలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
ఫలితం: కృష్ణ నవమి: కలహం, శుక్రవారం: పంటల సమృద్ధి, శ్రవణా నక్షత్రం: శుభకరం, సాధ్యనామ యోగం: పాడిపంటల వృద్ధి, గరజి కరణం: కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం, అపరాహ్ణ కాలం: ప్రజాపీడ, సింహం లగ్నం: వర్షాభావం, పూర్వాషాఢాది నాల్గో మండలం: శుభప్రదం,
సాముదాయిక ఫలితం: ఇరుగు పొరుగు దేశాలతో యుద్ధ వాతావరణం ఉంటుంది. దేశంలోఅనుకూల వర్షాలతో పాడిపంటల సమృద్ధి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజల మధ్య అంతఃకలహాలు ఏర్పడతాయి. మొత్తం మీద దేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది.
రాజు బుధుడు కావడం వల్ల ఈ ఏడాది మూడు తూముల వర్షం, నాలుగు తూముల వాయువు ఉంటుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఆఢకం దేవమానంతో 70 యోజనాల వెడల్పు, 100 యోజనాల ఎత్తు కలిగి ఉంది. వర్షపాతం సముద్రంలో 10 భాగాలు, పర్వతాల్లో 6 భాగాలు, భూమి మీద 4 భాగాలు కురుస్తుంది.
ఈ సంవత్సరం ఆఢకం వేశ్య హస్తగతమై ఉన్నది. సంవత్సరాది నుంచి అంటే 22-03-2023 నుంచి 28-04-2023 వరకు బాలవేశ్య హస్తగతమై ఉండటం వల్ల యుద్ధ వాతావరణం ఉంటుంది. తదాది 22-08-2023 వరకు యవ్వన వేశ్య హస్తగతమై ఉండటం వల్ల అనుకూల వర్షాలతో పంటలు బాగా పండుతాయి. తదాది 11-01-2024 వరకు బాలవేశ్య హస్తమందు, తదాది సంవత్సరాంతం వరకు యవ్వన వేశ్య హస్తగతమై ఉన్నది. మొత్తం మీద ఆఢక ఫలం శుభప్రదంగా ఉన్నది.
స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ శుక్ల పాడ్యమి తేది 21-4-2023 శుక్రవారం తెల్లవారితే శనివారం అనగా రా.తె. 5-09 గంటలకు దేవ గురువు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 22 నుంచి సార్ధ త్రికోటి సహిత గంగానది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. పన్నెండు రోజులు కొనసాగి మే 3వ తేదీతో ముగుస్తాయి. పుష్కరాల సమయంలో పితృదేవతల ప్రీత్యర్థం స్నాన, దాన, తర్పణ, పిండ ప్రదానాలు చేయడం పుణ్యప్రదం.