ఫ్రాన్స్‌లో నిరసనల సెగ
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో ఫ్రాన్స్ అట్టుడుకుతున్నది. రాజధాని ప్యారిస్ సహా పలు నగరాల్లో ఆందోళనకారులు విధ్వంసకాండ, లూటీలకు దిగడంతో పరిస్థితి చేయిదాటిపోతున్నది. ప్రభుత్వ సంపద, వాణిజ్య సముదాయాలు లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. అమూల్యమైన వారసత్వ సంపదగా భావించే పలు అద్భుతమైన భవనాలకు నిరసనకారులు నిప్పు పెట్టడంతో వాటిల్లోంచి మంటలు ఎగుసిపడుతున్న దృశ్యాలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో ఫ్రాన్స్ అట్టుడుకుతున్నది. రాజధాని ప్యారిస్ సహా పలు నగరాల్లో ఆందోళనకారులు విధ్వంసకాండ, లూటీలకు దిగడంతో పరిస్థితి చేయిదాటిపోతున్నది. ప్రభుత్వ సంపద, వాణిజ్య సముదాయాలు లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. అమూల్యమైన వారసత్వ సంపదగా భావించే పలు అద్భుతమైన భవనాలకు నిరసనకారులు నిప్పు పెట్టడంతో వాటిల్లోంచి మంటలు ఎగుసిపడుతున్న దృశ్యాలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. విద్యావ్యవస్థలో పరిస్థితులు మెరుగుర్చాలంటూ ఉన్నత పాఠశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు వీధుల్లోకి రావడంతో ఈ ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. బోధనా సిబ్బంది కొరత, సౌకర్యాల లేమికి నిరసనగా ఇది తలెత్తింది.
తదనంతరం దిగజారిన జీవనప్రమాణాలు, పెరుగుతున్న ఇంధన ధరల పెరుగుదల, సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయిన గృహవసతి వంటి సమస్యలపై నిరసన తెలియజేస్తూ కార్మిక సంఘాలు, రైతులు, సామాన్య ప్రజలు వచ్చి చేరడంతో ఆందోళన స్వరూపం పూర్తిగా మారిపోయింది. స్థూలంగా చెప్పాలంటే ఆదాయాలు పడిపోవడం, జీవనవ్యయం పెరగడం ఫ్రెంచ్ ప్రజలను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నది. ప్రజలకు, వాణిజ్య రంగానికి తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ ఆందోళనకారులు పట్టు వీడేందుకు ససేమిరా అంటున్నారు.
ఒక అంచనా ప్రకారం గత వారాంతంలో ఐదున్నర లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరుగుతున్న తీవ్ర ఘర్షణలతో అంతర్యుద్ధం లాంటి పరిస్థితి నెలకొన్నది. పెద్దసంఖ్యలో పోలీసులు అల్లర్లలో గాయపడ్డారు. అనేక నగరాల్లో కర్ఫ్యూ అమలవుతున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2,500 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనల నెపమంతా వలసదారులపైకి నెట్టే ప్రయత్నాలు సామాజిక మాధ్యమాల్లో ముమ్మరంగా జరుగుతున్నాయి. పైగా బూటకపు వీడియోలతో రకరకాల కథనాలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్‌లో జరుగుతున్న విధ్వంసానికి వలసదారులే కారణమని, వారి రాకకు అడ్డుకట్ట వేయాలని తనదైన ధోరణిలో పోస్ట్ పెట్టారు. కొందరు యూరప్ రాజకీయ నాయకులు సైతం ఇదే తరహాలో వలసదారులపై విమర్శలు ఎక్కుపెడుతూ ఈ చర్చకు ఆజ్యం పోస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్టు మతపరమైన కోణంలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఫ్రాన్స్ నాయకత్వం వామపక్షాలపై దాడి చేస్తున్నది. ఈ తరహా ప్రచారం అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించడమే అవుతుంది. ఈ విమర్శల్లో ఎక్కడా కూడా సామాన్యుల సమస్యలు ప్రస్తావనకు రాకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ పదవీకాలం ముగిసిపోనున్న తరుణంలో, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హింసాత్మక నిరసనలు పెల్లుబుకడం గమనార్హం.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి నినాదాన్ని ప్రపంచానికి అందించిన ఫ్రాన్స్‌కు నిరసన హక్కు గురించి తెలియజెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఫ్రాన్స్‌లో భారీస్థాయిలో ప్రజాందోళనలు జరగడం కొత్తేమీ కాదు. 19వ శతాబ్దిలో జరిగిన రైతుల తిరుగుబాట్లు, ప్యారిస్ విప్లవం వంటివి ప్రపంచ చరిత్రలో కీలక ఘటనలుగా నిలిచాయి. 20వ శతాబ్దిలో కార్మిక సంఘాల ఆందోళనలు, అవి సాధించిన విజయాలు హక్కులకు బలమైన పునాదులు వేశాయి. వాటన్నిటి గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకోవడం ఆనవాయితీ. విద్యార్థులు, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వేరే దారిలేక వీధుల్లోకి వచ్చారు. నెల రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నా తగిన విధంగా స్పందించని దేశ నాయకత్వమే ప్రస్తుత పరిస్థితికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.. హింసాకాండ, లూటీలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. దాంతోపాటే ప్రజల స్థితిగతులు మెరుగుపర్చడం మీద దృష్టి నిలపాల్సిన అవసరం ఉన్నదని ఫ్రాన్స్ పాలకులు గుర్తిస్తే మంచిది.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

