‘నెగెటివిటీ వ్యాప్తి చేసేవాళ్లు తమ జీవితాలను గొప్పగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి. నా నిజాయతీ వాళ్లకు అహంకారం అనిపిస్తే, నా ఆత్మవిశ్వాసం వాళ్లకు బలుపు అనిపిస్తే నేను తగ్గాలా? నా జర్నీ వాళ్లకు అర్థం కాకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా? నేను మారను..వాళ్లు మారాలి’ అంటూ సోషల్‌మీడియా ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ రూపొందించిన పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’ ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘కొందరు గ్రూప్‌గా మారి ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వెనక్కిలాగే పనులు చేస్తే ఎవరికి ఉపయోగం ఉండదు’ అని హెచ్చరించారు. సినిమా విశేషాల గురించి చెబుతూ ‘దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి వస్తున్న గొప్ప స్క్రిప్ట్ ఇదే అనిపించింది. మనకు ఏ చరిత్రను తెలియకుండా దాచారో, ఏ వీరుల చరిత్ర తెలియకూడదు అనుకున్నారో..ఆ చరిత్రను సరిదిద్దే ప్రయత్నమే ఈ సినిమా. మన చరిత్రను, బుర్ర కథల్ని ప్రపంచానికి తెలియజెప్పేలా ఈ సినిమా ఉంటుంది. చారిత్రక వీరుల త్యాగాలను సెలబ్రేట్ చేస్తుంది. ‘రణబాలి’ నా కెరీర్లోనే ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుంది’ అన్నారు.
ప్రపంచానికి చెప్పాల్సిన కథ ఇదని, ఈ సినిమాకోసం ఎంతో పరిశోధన చేశానని, రాయలసీమ వీరుడి కథగా ఆకట్టుకుంటుందని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ పేర్కొన్నారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ‘విజయ్ దేవరకొండతో ఎనిమిదేళ్ల ప్రయాణం మాది. అతను అద్భుతమైన వ్యక్తి. ఆయన మీద ఉద్దేశ్యపూర్వకంగా సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. విజయ్‌కి సినిమా తప్ప మరో లోకం లేదు. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోడు. అలాంటి హీరో మీద నెగెటివ్ ప్రచారం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సినిమాలో ప్రతీ డీటెయిల్ అథెంటిక్‌గా కనిపిస్తుంది. మీరు సినిమా చూస్తున్నంత సేపు ‘రణబాలి’ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎన్నో ఎఫర్ట్స్ పెట్టారు. గుర్రం స్వారీ నేర్చుకున్నారు. ఈ సినిమాతో ఆయన పెద్ద స్థాయికి వెళతారు’ అన్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నట విశ్వరూపం చూస్తారని నవీన్ యెర్నేని చెప్పారు.