Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) డిజిటల్ సందడికి సమయం వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ వివరాలను వెల్లడించింది. ఈ సినిమాను ఏప్రిల్ 16 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ తదితర భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మార్చి 19, 2026న ఉగాది కానుకగా ఈ చిత్రం విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టింది. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా నటించగా.. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చదలమర్రి నల్లనాగప్ప(పార్దీబన్) పరమ దుర్మార్గుడు. ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలనేది అతని లక్ష్యం. దానికోసం ఎంతకైనా తెగిస్తాడు. ఇందులో భాగంగా తనకు అడ్డున్న రాష్ట్ర ముఖ్యమంత్రిపై హత్యాప్రయత్నం చేస్తాడు. తీవ్రగాయాల పాలై, కొన ఊపిరితో ఉన్న ముఖ్యమంత్రి, హాస్పిటల్ ఇంటెన్సీవ్ కేర్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. దాంతో అదే పార్టీలోని మరో సీనియర్ నేతని అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. అతన్ని కూడా నల్లనాగప్ప హత్య చేయిస్తాడు. దాంతో పార్టీలో మూడో స్థానంలో ఉన్న నల్లనాగప్ప ముఖ్యమంత్రి అవుతాడు. అతని కొడుకు (కిల్లి క్రాంతి) తండ్రిలాగే రాక్షసుడు. ఎంజాయ్మెంట్ కోసం తలకోన ఫారెస్ట్‌కి వెళ్తాడు. అక్కడి పోలీసులు వందల టన్నుల గంజాయిని సీజ్ చేశారని తెలిసి, గంజాయి కావాలంటూ.. అక్కడి పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తాడు. పోలీసుల్ని, వాళ్ల కుటుంబీకుల్నీ చిత్రహింసలు పెడుతుంటాడు. అప్పుడొస్తాడు ఉస్తాద్ భగత్‌సింగ్ (పవన్‌కల్యాణ్). ముఖ్యమంత్రి కొడుకుని, అతని మనుషుల్ని ఓ రేంజ్లో ఆడుకుంటాడు. కొంతమందినైతే నిర్ధాక్షిణ్యంగా చంపేస్తాడు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. తన కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో.. పాతబస్తీలో ఉండే ఉగ్రవాదుల్ని ఆశ్రయిస్తాడు ముఖ్యమంత్రి. ఉగ్రవాదులు.. ముఖ్యమంత్రి కొడుకుని వెతుక్కుంటూ అడవిలోకి వస్తారు. వచ్చినవాళ్లను వచ్చినట్టే అందర్నీ చంపేస్తాడు ఉస్తాద్ భగత్‌సింగ్. ఇంతకీ ఎవరీ ఉస్తాద్ భగత్‌సింగ్? ముఖ్యమంత్రి కొడుకుని ఎందుకు కిడ్నాప్ చేశాడు? ముఖ్యమంత్రికీ ఉగ్రవాదులకూ సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే అసలు కథ.
Peru Bhagat, kaani udhyamam ey thana gurthimpu 🔥🚨 pic.twitter.com/5tYUxKmuKA
— Netflix India South (@Netflix_INSouth) April 11, 2026