Toxic | టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న యశ్ తాజా చిత్రం ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ వేడుకలో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి పరిధిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో విద్యార్థులు, అభిమానులు తరలివచ్చారు. అయితే హీరో యశ్‌ను దగ్గరగా చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో స్వల్ప తొక్కిసలాట జరిగి పలువురు గాయపడినట్లు సమాచారం.ఈ కార్యక్రమానికి హీరో యశ్‌తో పాటు ఎమ్మెల్యే మల్లారెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. యశ్ వేదికపై మాట్లాడుతూ ఉండగా అభిమానులు, విద్యార్థులు పెద్ద ఎత్తున అరుపులు, కేకలతో సందడి చేశారు. తమ అభిమాన హీరోను మరింత దగ్గరగా చూసేందుకు కొందరు ఒక్కసారిగా వేదిక వైపు చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించడంతో అక్కడ జనసందోహం పెరిగింది.
అభిమానుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో ప్రాంగణంలో కొంత గందరగోళం నెలకొంది. జనసందోహం ఒత్తిడిని తట్టుకోలేక అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్ స్తంభం, భారీ స్పీకర్ బాక్సులు కిందపడిపోయాయి. దీంతో సమీపంలో ఉన్న విద్యార్థులు, అభిమానుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే స్పందించిన నిర్వాహకులు, భద్రతా సిబ్బంది గాయపడిన వారిని అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చి అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు.
అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భారీ సంఖ్యలో అభిమానులు ఉండటంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. గాయపడిన వారికి చికిత్స అందించే ఏర్పాట్లు చేయడంతో పాటు మిగిలిన అభిమానులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యశ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈ కార్యక్రమానికి ఊహించిన దానికంటే ఎక్కువ మంది హాజరైనట్లు తెలుస్తోంది. ఒకవైపు ‘టాక్సిక్’ సినిమాపై భారీ హైప్ నెలకొనగా, మరోవైపు యశ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానుల ఉత్సాహం ఈ ఘటనకు దారితీసినట్లు సమాచారం. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్-ఇండియా స్థాయిలో సంచలన క్రేజ్ సంపాదించుకున్న యశ్ నటిస్తున్న చిత్రం కావడంతో ‘టాక్సిక్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రమోషనల్ ఈవెంట్లకే ఇంత పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తుండటం యశ్ క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.