Top Gun Maverick | హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టామ్ క్రూజ్ ‘టాప్ గన్’ సిరీస్ చిత్రాలు ఇప్పుడు మళ్ళీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. 1986లో విడుదలైన క్లాసిక్ ‘టాప్ గన్’ మరియు దానికి సీక్వెల్గా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘టాప్ గన్: మావెరిక్’ చిత్రాలను కలిపి ఒకే భాగంగా థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు మేకర్స్. ఈ సినిమాను వారం పాటు ఐమాక్స్ వెర్షన్లో తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేసింది.
నావీ పైలట్ల సాహసాలు, గాల్లో చేసే విన్యాసాలు మరియు టామ్ క్రూజ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ను వెండితెరపై మరోసారి అనుభూతి చెందాలని కోరుకునే సినీ ప్రియుల కోసం ఈ ప్రత్యేక షోలను ఏర్పాటు చేస్తున్నారు. ‘టాప్ గన్: మావెరిక్’ కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషనల్గా కూడా ప్రేక్షకులను కట్టిపడేయడంతో, ఈ రీ-రిలీజ్కు భారీ స్పందన వచ్చే అవకాశం ఉంది.