Tollywood | ఈ వేసవి వేడిలో ప్రేక్షకులకు కూల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు టాలీవుడ్లో చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. విలేజ్ కామెడీ ఎంటర్టైనర్స్ నుంచి ప్రేమ కథల వరకు విభిన్న జానర్లతో థియేటర్లలో సందడి చేసేందుకు కొన్ని ఆసక్తికర చిత్రాలు ఏప్రిల్ మూడో వారంలో విడుదలకు రెడీ అయ్యాయి.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా పరిచయం అవుతున్న తొలి చిత్రం తిమ్మరాజుపల్లి TV. 90ల నాటి నేపథ్యంలో రూపొందిన ఈ విలేజ్ కామెడీ ఎంటర్టైనర్ అప్పటి జీవనశైలిని, గ్రామీణ వాతావరణాన్ని గుర్తు చేసేలా ఉండబోతోంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దాదాపు కొత్త నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించారు. సాయితేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతుండగా, దర్శకుడు వి. మునిరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో తిరువీర్ నటిస్తున్న తాజా చిత్రం పాపం ప్రతాప్. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట జీవితంలో కేవలం నాలుగు రోజుల్లోనే ఎదురయ్యే సమస్యల చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. దర్శకుడు ఎస్పీ దుర్గా నరేశ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అజయ్ ఘోష్, రఘుబాబు, ప్రసాద్ బెహర వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 17న విడుదల కానుంది.
యువ హీరో నాగశౌర్య నటించిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు రామ్ దేశినా తెరకెక్కించిన ఈ యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరోయిన్గా విధి నటించింది. దాదాపు మూడు సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా చివరికి విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజ్ కానుండగా, యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇదే రోజున ‘తెరచాప’ అనే మరో చిన్న సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక మలయాళ స్టార్ టొవినో థామస్ హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన ‘పళ్లి చట్టంబి’ కూడా విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు డీజో జోస్ ఆంటోనీ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను తొలుత ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 15న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. 1950-60 దశకంలోని చారిత్రక నేపథ్యంలో రూపొందిన ‘పళ్లి చట్టంబి’ ట్రైలర్, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. యాక్షన్, ఎమోషన్ మేళవింపుతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రెండు చిత్రాలు కూడా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందడం విశేషం. ఒకటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, మరొకటి లవ్ డ్రామాగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. చిన్న సినిమాలే అయినప్పటికీ కంటెంట్ పరంగా బలంగా ఉంటే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించగలవని గత అనుభవాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాలకు అవకాశాలు తగ్గుతున్నప్పటికీ, మంచి కథ, సహజమైన నటన ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మేకర్స్ నమ్ముతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాలు తెరకెక్కడం విశేషం. ఏప్రిల్ మూడో వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి మొదలవుతుండగా, వీటిలో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.