Hit 2 Review | నటీనటులు – అడివి శేష్ (AdiviSesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), రావు రమేష్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్, సుహాస్ తదితరులు
సాంకేతిక వర్గం – సినిమాటోగ్రఫీ – మణికందన్, ఎడిటింగ్ – గ్యారీ బీ హెచ్, సంగీతం – జాన్ స్టీవార్ట్ ఎడూరి, నిర్మాతలు – నాని, ప్రశాంతి తిపిర్నేని, రచన, దర్శకత్వం – డా.శైలేష్ కొలను (Sailesh Kolanu)
ఏదో ఒక కొత్త దారిని వెతుక్కుంటే తప్ప చిత్ర పరిశ్రమలోకి వచ్చే నూతన దర్శకులు నిలదొక్కుకోలేరు. హిట్ ఫార్ములాను టాలీవుడ్ లోకి తీసుకొచ్చి అలాంటి రొటీన్ కు భిన్నమైన ప్రయత్నమే చేశారు దర్శకుడు శైలేష్ కొలను. తొలి సినిమా విజయవంతం కాగా తాజాగా హిట్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మేజర్ వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత అడివి శేష్ నటించిన సినిమా కావడం, హీరో నాని ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఆ హైప్ ను సినిమా రీచ్ అయ్యిందా లేదా రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
దారి తప్పిన భార్య వల్ల ఇబ్బందులకు గురైన రాంప్రసాద్ (హర్ష వర్థన్) ట్రాజెడీని చూపిస్తూ సినిమా మొదలవుతుంది. క్రైం బ్రాంచ్ ఎస్పీ కేడీ అలియాస్ కృష్ణ దేవ్ (అడివి శేష్), ఆర్య (మీనాక్షి చౌదరి)ని ప్రేమించి డేటింగ్ చేస్తుంటాడు. బార్ లో పనిచేసే సంజన అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేస్తాడు హంతకుడు. ఈ కేసును కృష్ణ దేవ్ టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఆఫీసర్స్ అభి (మాగంటి శ్రీనాథ్), వర్ష (కోమలీ ప్రసాద్) ఇన్వెస్టిగేషన్ లో భాగమవుతారు. ఫొరెన్సిక్ నివేదికలో హత్యకు గురైంది ఒకమ్మాయి కాదని మరో ఇద్దరు యువతుల శరీర భాగాలను సంజన బాడీలో కలిపారని తేలుతుంది. దీంతో కేసును మరింత సీరియస్ గా తీసుకుంటారు. క్రైమ్ సీన్ లోని ఆధారాలతో రాఘవుడు అనే యువకుడిని కృష్ణ దేవ్ అరెస్ట్ చేస్తాడు.
అమ్మాయి హత్య కేసుతో బయట ఆందోళనలను జరుగుతుంటాయి. ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు పోలీస్ అధికారులు రాఘవుడిని ఎన్ కౌంటర్ చేయాలని నిర్ణయిస్తారు. అతను నిర్దోషి అని తెలుసుకున్న కృష్ణ దేవ్ ఆ ఎన్ కౌంటర్ జరగకుండా అడ్డుపడతాడు. హత్యలకు గురైన మహిళలు హర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను తెలియడంతో ఇన్వెస్టిగేషన్ లో మరో క్లూ లభిస్తుంది. మరోవైపు రాఘవుడు జైల్లో ఆత్మహత్యకు గురవడం, ఎన్ కౌంటర్ విషయం లీక్ చేసిన కారణంగా కృష్ణ దేవ్ ను డిపార్ట్ మెంట్ నుంచి సస్పెండ్ చేయడం, ఆర్య కిడ్నాప్ అవడంతో కథలో తీవ్రత పెరుగుతుంది. ఈ అమ్మాయిలను క్రూరంగా హత్య చేస్తున్న హంతకుడు ఎవరు, అతని నేపథ్యమేంటి, కృష్ణ దేవ్ ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు, తన ప్రియురాలిని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే..?
హిట్ వరల్డ్ ను మరింత విస్తృతం చేయాలని అడివి శేష్ తో, పెద్ద స్పాన్ లో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు చెప్పుకున్నారు. సినిమా చూస్తే గత సినిమా చేసిన విశ్వక్ సేన్ స్థానంలో ఇంకాస్త ఇమేజ్ ఉన్న అడివి శేష్ ను తీసుకొచ్చారు అంతే తేడా. మిగతా ఎక్కడా సినిమా స్పాన్ పెంచినట్లు లేదు. చాలా కాంపాక్ట్ గా మూవీ తెరకెక్కించారు. హత్య కేసుల ఇన్వెస్టిగేషన్ కోసం ప్రారంభం ముందే హీరో హీరోయిన్ల ప్రేమను, వారి డ్యూయెట్ చూపించారు. ప్రారంభంలో తప్ప కథలో ఇంకెక్కడా వీరి లవ్ స్టోరికి స్థానం లేదు. అక్కడ కొంత రిలీఫ్ అయ్యే ప్రేక్షకుడు ఇన్వెస్టిగేషన్ లో లీనమవుతాడు.
సంజన హంతకుడిని పట్టుకునే క్రమంలో కథానాయకుడు అతని టీమ్ సాగించిన విచారణ క్రమమంతా ఆసక్తికరంగా సాగుతుంది. హంతకుడు తెలివిగా ప్రవర్తించడంతో అతనెవరో తెలుసుకునేందుకు క్రైం బ్రాంచ్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. డిపార్ట్ మెంట్ నుంచి పూర్తి సహకారం లేకపోవడం కూడా కొన్నిసార్లు వారిపై ఒత్తిడి పెంచుతుంది. కేసులో ఒక్కో చిక్కు ముడి విడదీస్తూ వెళ్లిన హీరో నిందితుడు పట్టుకుంటాడు. ఆ చివరి ఇరవై నిమిషాలు సినిమా మరింత ఇంటెన్స్ గా సాగుతుంది. అతను ఎందుకింత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు అనే విషయానికి ఒక నేపథ్యం కూడా చూపించారు.
చిన్న చిత్రాలు చేసినా రాని గుర్తింపు..
కృష్ణ దేవ్ పాత్రలో అడివి శేష్ సెటిల్డ్ పర్మార్మెన్స్ చేశాడు. థ్రిల్లర్ సినిమాల్లో నటించిన అనుభవం అతనికి ఉపయోగపడింది. దీంతో ఇన్వెస్టిగేషన్ జరిపే సన్నివేశాల్లో శేష్ ఈజ్ తో కనిపించాడు. ఆర్య పాత్రలో మీనాక్షి చౌదరి క్యారెక్టర్ పరిమితమే అయినా ఉన్నంతలో బాగా నటించింది. కృష్ణ దేవ్ టీం శ్రీనాథ్, కోమలికి తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ ఇది. గతంలో అనేక చిన్న చిత్రాలు చేసినా రాని గుర్తింపు ఈ సినిమాతో వారికి లభించింది. ఏడీజీపీ నాగేశ్వరరావు పాత్రకు రావు రమేష్ సరిపోయారు. ఆ క్రూరమైన విలన్ ఎవరో చెబితే కథలో అసలైన ట్విస్ట్ పోయినట్లే. దర్శకుడు శైలేష్ ప్రచార కార్యక్రమాల్లో చెప్పుకున్నట్లు సినిమాను సహజంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.
ఇన్వెస్టిగేషన్ జరిగే కోణంలోనే తప్ప, ఎక్కడా క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకోలేదు. కథకు స్టిక్ ఆన్ అయ్యాడు. కమర్షియల్ సినిమాను సహజత్వంతో రూపొందించడం దర్శకుడికి అసలైన పరీక్ష. దాన్ని ఎదుర్కొన్నాడు శైలేష్. జాన్ స్టీవార్ట్ ఎడూరి సంగీతం కథలో కాక్ టెయిల్ లా కలిసిపోయింది. చివరలో హిట్ 3లో నాని హీరో అని ప్రకటించడం కొసమెరుపు. అర్జున్ సర్కార్ గా నాని హిట్ 3ని లీడ్ చేస్తారని అనౌన్స్ చేశారు.
ఫ్లస్ పాయింట్స్..
అడివి శేష్ నటన
ఆసక్తి రేపే స్క్రీన్ ప్లే
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్..
హింసాత్మక సన్నివేశాలు
చివరగా…“హిట్ 2” సక్సెస్ ఫుల్ ఇన్వెస్టిగేషన్
రేటింగ్ 3/5