Tollywood | టాలీవుడ్ బాక్సాఫీస్ గత కొన్ని వారాలుగా కాస్త నెమ్మదించినట్లే కనిపిస్తోంది. భారీ స్టార్ హీరోల సినిమాల హడావిడి తగ్గిపోవడంతో.. ఇప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలే థియేటర్లలో సందడి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ తరహా చిత్రాలు ప్రేక్షకుల్లో సరైన ఆసక్తి కలిగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు మే 8న విడుదలకు సిద్ధమైన మూడు తెలుగు సినిమాల పరిస్థితి కూడా దాదాపు అలానే ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న సతీ లీలావతి, రేజర్, గోదారి గట్టుపైన చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. కానీ ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్కటి కూడా విడుదలకు ముందు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోయిందనే టాక్ నడుస్తోంది.
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ సినిమాపై మొదట్లో కొంత ఆసక్తి కనిపించినా.. రిలీజ్ దగ్గరపడే కొద్దీ ఆ హైప్ తగ్గినట్లుగా కనిపిస్తోంది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న లావణ్య.. ఈ సినిమాతో మళ్లీ బలమైన కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీజర్లు, ప్రమోషనల్ కంటెంట్ విడుదలైనప్పటికీ.. సినిమా అసలు జానర్ ఏమిటి? కథ ఎలా ఉండబోతోంది? అన్న విషయాలపై ప్రేక్షకుల్లో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక నటుడు, దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ‘రేజర్’ సినిమాపై కూడా పరిస్థితి అంతే కనిపిస్తోంది. విభిన్నమైన కథలు, కొత్త కాన్సెప్టులతో సినిమాలు చేయడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రవిబాబు.. ఈసారి థ్రిల్లర్ జానర్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే గతంలో ఆయన సినిమాలకు కనిపించే క్యూరియాసిటీ ఈసారి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రమోషన్స్ పరంగా సినిమా పెద్దగా హైలైట్ కాకపోవడం మైనస్‌గా మారిందని అంటున్నారు.
మరోవైపు యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ నటించిన ‘గోదారి గట్టుపైన’ సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. గ్రామీణ వాతావరణం, భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచి కంటెంట్ ఉందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కానీ ఆ విషయాన్ని ప్రేక్షకుల వరకు బలంగా తీసుకెళ్లడంలో మేకర్స్ పూర్తిగా సక్సెస్ కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్లో చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య, సరైన ప్రమోషన్ల లోపం, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కంటెంట్ లేకపోవడం వంటి అంశాలు పెద్ద సవాలుగా మారాయి. స్టార్ హీరోల సినిమాల మధ్య చిన్న చిత్రాలు నలిగిపోతున్నాయనే చర్చ కూడా తరచూ వినిపిస్తోంది. మంచి కథ ఉన్నా.. దాన్ని ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్లే మార్కెటింగ్ లేకపోతే సినిమాలు ఓపెనింగ్స్ దక్కించుకోవడం కష్టమవుతోంది. అయితే గతంలో కూడా బజ్ లేకుండా విడుదలై.. పాజిటివ్ టాక్‌తో సూపర్ హిట్స్‌గా నిలిచిన చిన్న సినిమాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి కూడా కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. మరి ఈ వారం విడుదలవుతున్న ఈ మూడు చిత్రాల్లో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్‌గా నిలుస్తుందో చూడాలి.