Rahul Vijay | రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ కాంబినేషన్లో వస్తోన్న కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ ‘అ’ నుంచి మేకర్స్ తాజాగా ‘బ్లడీ హంగర్’ పేరుతో ఓ పవర్ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్లో మంచి బజ్ ఏర్పడగా, తాజాగా విడుదలైన ఈ టీజర్ అంచనాలను రెట్టింపు చేసింది. డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ ఆధారంగా కట్ చేసిన ఈ గ్లింప్స్ సినిమాపై భారీ క్యూరియాసిటీని పెంచుతోంది.
స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్న ఈ డార్క్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అక్టోబర్ 9, 2026న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. యువతుల అదృశ్యం, చీకట్లో నక్కిన ఓ మిస్టీరియస్ దుష్టశక్తి చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
గ్లింప్స్‌లో రాహుల్ విజయ్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా చాలా ఇంటెన్స్‌గా కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అలాగే ఆర్చన అయ్యర్ పాత్రకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు కథలోని మిస్టరీని మరింత పెంచుతున్నాయి. ‘అమ్మాయి’, ‘అదృశ్యం’, ‘అన్వేషణ’ అనే పదాలను రివీల్ చేస్తూ సాగిన తీరు సినిమా ఇన్వెస్టిగేషన్ జానర్లో అత్యంత ఉత్కంఠభరితంగా ఉండబోతుందని స్పష్టం చేస్తోంది.
ఇక ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల అందించిన థంపింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. భయాన్ని, ఉత్కంఠను నూటికి నూరు శాతం ప్రేక్షకులకు అనుభూతి చెందేలా ఆయన మ్యూజిక్ ఉంది. మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను మరింత రిచ్‌గా చూపించగా, అభినవ్ వి. కునపరెడ్డి, గ్యారీ బీహెచ్ల షార్ప్ ఎడిటింగ్ గ్లింప్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.
జాన్ విజయ్, సుదర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాతగా అభినవ్ వి. కునపరెడ్డి వ్యవహరిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా జాయింట్ ఫ్యామిలీ ఫిల్మ్స్ పనిచేస్తుండగా, పీఆర్వోలుగా మడూరి మధు, ధీరజ్, ప్రసాద్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అన్ని హంగులను పూర్తి చేసుకుని అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం టాలీవుడ్లో సరికొత్త థ్రిల్లర్ అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది.