Sonam Kapoor | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. మార్చి 29న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో అనీల్ కపూర్ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఒక కుమారుడు ఉన్న సోనమ్–ఆనంద్ ఆహుజా దంపతులకు ఇది రెండో సంతానం కావడంతో వారి ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. తాజాగా తన రెండో కుమారుడిని అభిమానులకు పరిచయం చేస్తూ సోనమ్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు షేర్ చేశారు. “మా జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పుడు మేము నలుగురం ఉన్న అందమైన కుటుంబం” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెద్ద కుమారుడు ‘వాయు’ తన తమ్ముడిని ఆతృతగా స్వాగతిస్తున్నాడని ఆమె పేర్కొన్నారు.
తన జీవితంలోని ఈ ప్రత్యేక సమయంలో తోడుగా నిలిచిన భర్త ఆనంద్ అహుజాకు ధన్యవాదాలు తెలిపిన సోనమ్, తమ కుటుంబంతో గడుపుతున్న ప్రతి క్షణాన్ని ఎంతో మధురంగా ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్ వైద్య బృందానికి కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తన గైనకాలజిస్ట్ డాక్టర్ అవాన్ దాదినా గురించి ప్రస్తావిస్తూ, రెండు గర్భధారణల సమయంలోనూ ఆమె అందించిన సేవలు, సానుభూతి మరువలేనివని పేర్కొన్నారు. ప్రొఫెషనలిజం, మానవత్వం కలగలిపిన సేవలు అందించిన హాస్పిటల్ టీమ్ తన హృదయాన్ని గెలుచుకుందని చెప్పారు.
హాస్పిటల్ సౌకర్యాల గురించి మాట్లాడుతూ నీతా అంబానిపై సోనమ్ ప్రశంసలు కురిపించారు. అత్యున్నత ప్రమాణాలు, సానుభూతి కలిసిన ఇలాంటి వాతావరణాన్ని సృష్టించడం గొప్ప విషయమని కొనియాడారు. 2018లో వివాహం చేసుకున్న సోనమ్–ఆనంద్ దంపతులకు 2022లో ‘వాయు’ జన్మించగా, ఇప్పుడు రెండో బాబు రాకతో వారి కుటుంబం మరింత సంపూర్ణమైంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా, బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. “బేబీ చాలా క్యూట్‌గా ఉన్నాడు”, “కంగ్రాట్స్ సోనమ్” అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి, సోనమ్ కపూర్ కుటుంబంలో కొత్త సభ్యుడి రాక ఆనందాన్ని రెట్టింపు చేసింది.