Sireesha | తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ‘మొగలిరేకులు’ సీరియల్‌తో సుపరిచితురాలైన నటి శిరీష వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ నటుడు, ఆర్జే, యాంకర్ మహేంద్ర బొర్రాల అలియాస్ మహితో ఆమె శుక్రవారం ఉదయం ఘనంగా వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక సింపుల్‌గా, ఆత్మీయంగా జరిగింది. తన జీవితంలోని ఈ ప్రత్యేక క్షణాలను శిరీష సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. “ఎట్టకేలకు మా సీక్రెట్ బయటపడింది.. శాశ్వతమైన బంధానికి ఇది ఆరంభం.. జీవితాంతం ఇలాగే కలిసి సాగాలి” అంటూ భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నవదంపతుల వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శిరీష భర్త మహేంద్ర బొర్రాల కూడా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడే. మహి పేరుతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన తొలుత రేడియో జాకీగా తన కెరీర్‌ను ప్రారంభించారు. తన ప్రత్యేకమైన గొంతు, మాటతీరుతో మంచి గుర్తింపు సంపాదించిన ఆయన.. ఆ తర్వాత యాంకర్‌గా కూడా పలు కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం నటన రంగంలోకి అడుగుపెట్టిన మహి.. ‘ఇంటింటి రామాయణం’, ‘మగువ ఓ మగువ’ వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటుడిగా, యాంకర్‌గా, ఆర్జేగా విభిన్న రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు.
శిరీష తన తొలి సీరియల్ ‘మొగలిరేకులు’తోనే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ సీరియల్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు, ప్రత్యేకమైన క్రేజ్ లభించింది. అనంతరం ‘రాములమ్మ’, ‘స్వాతి చినుకులు’, ‘చెల్లెలి కాపురం’, ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’, ‘త్రిశూలం’ వంటి పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు.ఓ కార్యక్రమంలో అనుకోకుండా పరిచయమైన శిరీష, మహేంద్రల మధ్య మొదట స్నేహం ఏర్పడింది. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం తమ బంధాన్ని వ్యక్తిగతంగానే ఉంచుకున్న ఈ జంట.. చివరకు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.సింపుల్‌గా, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన వీరి వివాహానికి టీవీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు, స్నేహితులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘మొగలిరేకులు’ ఫేమ్ శిరీష కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో ఆమె అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram
A post shared by It’s-me-Sireesha Actor- Official (@its_me_sireesha_actor)