షారుఖ్‌ఖాన్ తాజా చిత్రం ‘కింగ్’ విడుదల తేదీని ప్రకటించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘పఠాన్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా షారుఖ్‌ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ వెండితెరపై అరంగేట్రం చేస్తున్నది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సుహానాఖాన్కు మార్గదర్శిగా, ఆమెను చీకటి ప్రపంచం తాలూకు ప్రమాదాల నుంచి రక్షించే పవర్ఫుల్ డాన్‌గా షారుఖ్‌ఖాన్ కనిపించనున్నారు. అభిషేక్‌బచ్చన్ ప్రతినాయక పాత్రధారి.
శుక్రవారం ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు టీజర్‌ను కూడా విడుదల చేశారు. భిన్న కాలాల్లో నడిచే ఈ కథలో షారుఖ్‌ఖాన్ అండర్‌వరల్డ్ డాన్‌గా డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించారు. యాక్షన్ సీక్వెన్స్‌ను ైస్టెలిష్‌గా డిజైన్ చేశారు. ‘అతని గర్జన సామ్రాజ్యంలో ప్రకంపనలు సృష్టించడం ఖాయం. కింగ్ వస్తున్నాడు’ అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. రాణీముఖర్జీ, దీపికా పడుకోన్, జాకీష్రాఫ్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమవుతున్నారు. స్వీయ నిర్మాణ సంస్థ రెడ్‌చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుఖ్‌ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.