వెండితెరపై నాయికల కెరీర్ పరిమితమే. చాలా మంది తారలు మహా అయితే ఐదారేండ్లు అవకాశాలు పొందుతుంటారు. కానీ దక్షిణాదిలో అగ్రతారగా 13 ఏండ్లుగా కొనసాగుతున్నది సమంత. అనుభవంతో పాటే వైవిధ్యమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నది. ఇటీవల ‘శాకుంతలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిందీ నాయిక. ప్రస్తుతం సమంత తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’, హిందీలో ‘సిటాడెల్’ రీమేక్‌తో పాటు ‘చెన్నై స్టోరి’ అనే ఇంగ్లీష్ సినిమా చేస్తున్నది.
‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా ‘చెన్నై స్టోరి’ సినిమా తెరకెక్కుతున్నది. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సమంత తన కెరీర్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. తనకు వచ్చే అవకాశాల్లో పాన్ ఇండియా సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె భావిస్తున్నదట. తనకున్న ఇమేజ్ను కాపాడుకుంటూ ఇంకొన్నేళ్లు కెరీర్ సాగించాలంటే చాలా సెలెక్టివ్‌గా ప్రాజెక్ట్స్ చేయాలన్నది సమంత ఆలోచనగా కనిపిస్తున్నది.