విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న గ్రామీణ ప్రేమకథాచిత్రం ‘సింగిల్ రాజు’. ఎస్ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శక,నిర్మాత వేణు ఊడుగుల.. టైటిల్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్‌ని కూడా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
ప్రేక్షకులను అలరించే మంచి వినోదాత్మకచిత్రం ‘సింగిల్ రాజు’ అని చిత్ర దర్శకుడు ఎస్ఎస్ వర్మ చెప్పారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరోహీరోయిన్లు విశ్వస్, మౌనిక, దివ్య ఆనందం వెలిబుచ్చారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యువతరం ప్రేమకథాచిత్రానికి చెందిన ఇతర విశేషాలు, నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయితేజ కుందారపు, నితీష్.