Review : రామారావు ఆన్ డ్యూటీ
Ramarao on duty movie review
తారాగణం: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశకౌశిష్, వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్ల భరణి, జాన్ విజయ్, రాహుల్ రామకృష్ణ, చైతన్యకృష్ణ తదితరులు
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
సంగీతం: సామ్ సీఎస్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
ప్రస్తుతం తెలుగు చిత్రసీమ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నది. కొన్ని వారాలుగా థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడం దర్శకనిర్మాతలకు సవాలుగా మారింది. ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ బంద్ చేయబోతున్నామని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో కూడా రవితేజ నటించిన ‘రామారావు ఆన్‌డ్యూటీ’ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. రవితేజ నుంచి మరో పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ రాబోతుందని ఆభిమానులు ఉత్సాహంగా ఎదురుచూశారు. మరి ఈ సినిమా ఆ అంచనాల్ని ఎంతవరకు అందుకుందో తెలుసుకుందాం..
కథ గురించి..
1995 నేపథ్యంలో నడిచే కథ ఇది. రామారావు (రవితేజ) నీతి, నిజాయితీ కలిగిన తహశీల్దార్. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలకు సేవ చేసేందుకు గొప్ప మార్గమని నమ్ముతాడు. శ్రీకాకుళంలో భూములు కోల్పోయిన రైతుల పక్షాన నిలిచి వారికి సరైన పరిహారం అందేలా చూస్తాడు. అనంతరం ఆయన చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్‌కు బదిలీపై వస్తాడు. అక్కడ ఓ సందర్భంలో తన మాజీ ప్రేయసి మాలిక (రజీషా విజయన్) కలుసుకుంటాడు. ఆమె భర్త ఏడాదికాలంగా కనిపించకుండా పోయాడని తెలుస్తుంది. ఈ మిస్సింగ్ కేసును ఛేదించే బాధ్యతను తీసుకుంటాడు రామారావు. ఈ క్రమంలో మాలిక భర్తతో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో ఇరవై మంది ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదని తెలుసుకుంటాడు. ఈ మిస్సింగ్ కేసులను పరిశోధించే క్రమంలో రామారావుకు భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అంతమంది మిస్సింగ్ వెనక ఎర్రచందనం మాఫియా ప్రమేయం ఏమిటి? ఈ కేసును రామారావు ఎలా ఛేదించాడు? దోషులుగా ఎవరిని నిర్ధారించాడన్నదే మిగతా చిత్ర కథ..
కథా విశ్లేషణ…
యథార్థ సంఘటలన స్ఫూర్తితో 1995 దశకం నేపథ్యంలో దర్శకుడు శరత్ మండవ ఈ కథను రాసుకున్నాడు. సాధారణంగా కథానాయకుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే వ్యవస్థలోని లోటుపాట్లను సంస్కరించి లక్ష్యాన్ని సాధించే ధీరోదాత్తుడిగా చూపిస్తుంటారు. కానీ ఈ కథను ఎర్రచందనం మాఫియా..అందుకు సహకరించే పోలీస్ నెట్వర్క్ నేపథ్యంలో అల్లుకున్నారు. దీనికి మర్డర్ మిస్టరీ ఎలిమెంట్‌ను జత చేసి ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్‌గా కథను నడిపించారు. ప్రజల పక్షాన నిలిచే ప్రభుత్వ ఉద్యోగిగా రామారావు పాత్రను పరిచయం చేసిన తీరును చూసి..ఆయన పోరాటం ఏ సామాజిక సమస్యలపైనో ఉండబోతుందని ప్రేక్షకులు భావిస్తారు. రామారావు మాజీ ప్రేయసి మాలిక తన భర్త మిస్సింగ్ గురించి చెప్పడంతో కథ మలుపు తీసుకుంటుంది. అక్కడి నుంచి వరుస మిస్సింగ్‌ల వెనకున్న నెట్‌వర్క్‌ను ఛేదించానికి రామారావు చేసే ప్రయత్నాలను చూపిస్తుంటారు. అయితే ఇవేవీ అంత ఉత్కంఠను పంచలేకపోయాయి. తన చిన్నమ్మ కొడుకు అనంత్ (రాహుల్ రామకృష్ణ) ఎర్రచందనం మాఫియా నెట్‌వర్క్‌లో సభ్యుడని రామారావు తెలుసుకునే ఎపిసోడ్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగినా..ఆ తర్వాత సాగే పరిశోధన ప్రేక్షకుల ఊహలకు అనుగుణంగా సాగడం కథనంలోని లోపంగా అనిపిస్తుంది.
తన పరిశోధనలో భాగంగా రామారావు అనేక చిక్కుముడులను విప్పుడుతున్నట్లు అనిపించినా ఆ సన్నివేశాలేవీ ఆసక్తికి కలిగించలేకపోయాయి. ఎస్పీ దేవానంద్‌కు (జాన్ విజయ్) ఎర్రచందనం మాఫియాతో సంబంధాలున్నాయని తెలిసిపోవడంతోనే కథలోని మిస్టరీ వీడిపోయినట్లుగా అనిపిస్తుంది. ఓ దశలో కథ, కథనాలు సాగతీతగా అనిపిస్తాయి. రవితేజ వంటి మాస్ హీరోతో ఓ ఇన్వెస్టిగేటివ్ మూవీ చేయాలనే ప్రయత్నం కొత్తగా అనిపించినప్పటికీ ఆయన శైలి కమర్షియల్ అంశాలు మిస్ కావడం వెలితిగా అనిపిస్తుంది. అయితే పోరాట ఘట్టాల్ని మాత్రం అభిమానుల్ని ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దారు. ైక్లెమక్స్ ఘట్టాలు కూడా ఏ మాత్రం ఉత్కంఠను పంచలేకపోయాయి. చివరగా తన మిషన్‌లో సక్సెస్ అయిన రామారావును ప్రభుత్వం ఎర్రచందనం మాఫియాను అణచివేసే స్పెషలాఫీసర్‌గా నియమిస్తుంది. కథలోని ఈ మలుపుతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు హింట్ ఇచ్చారు.
నటీనటుల పర్ఫార్మెన్స్
రవితేజకు ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు. ప్రభుత్వ ఉద్యోగి రామారావుగా ఆయన తనదైన శైలి పర్ఫార్మెన్స్తో మెప్పించాడు. లుక్స్‌పరంగా బరువు తగ్గి స్లిమ్‌గా కనిపించాడు. ఎమోషన్, యాక్షన్ ఎపిసోడ్స్‌లో రవితేజ తనదైన మార్క్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వేణు తొట్టెంపూడి సీఐ మురళి పాత్రలో కనిపించారు. ఆయన కామెడీ టైమింగ్, పర్ఫార్మెన్స్ బాగున్నాయి. అయితే కథలో అంతగా ప్రాధాన్యతలేని క్యారెక్టర్ కావడం మైనస్‌గా అనిపిస్తుంది. కథానాయికలు రజీషా విజయన్, దివ్యాంశకౌశిష్లు అభినయ ప్రధానమైన పాత్రల్లో కనిపించారు. మిగతా పాత్రల్లో నాజర్, తనికెళ్ల భరణి తమదైన నటనతో మెప్పించారు. రాహుల్ రామకృష్ణ, అరవింద్‌కృష్ణ నెగెటివ్ రోల్స్‌లో కనిపించారు. సామ్ సీఎస్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. సిధ్‌శ్రీరామ్ ఆలపించిన ఓ గీతం, స్పెయిన్ నేపథ్యంతో తెరకెక్కించిన ఓ పాట మెలోడీ ప్రధానంగా ఆకట్టుకుంటాయి. కథలోని ఎమోషన్స్‌ను ఎలివేట్ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. సత్యన్ సూర్యన్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ముఖ్యంగా పాటల్లో విజువల్స్‌ను బాగా చూపించారు. ఇక నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు.
తీర్పు:
‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో రవితేజ మార్క్ మాస్ అంశాలు, వినోదం మిస్ అయిందనే భావన కలుగుతుంది. కథాపరమైన ట్రీట్మెంట్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. అయితే ఇన్వెస్టిగేటివ్ కాన్సెప్ట్స్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఈ సినిమా కాస్త నచ్చే అవకాశం ఉంది.
రేటింగ్: 2.5/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

