రివ్యూ: ది వారియర్
తారాగణం: రామ్, కృతిశెట్టి, ఆది, నదియా, బ్రహ్మాజీ తదితరులు
సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
మాటలు: సాయిమాధవ్ బుర్రా-లింగుస్వామి
నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
దర్శకత్వం: లింగుస్వామి
తమిళంలో మాస్, యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు దర్శకుడు లింగుస్వామి. ఆయన ఖాతాలో పలు సూపర్‌హిట్ చిత్రాలున్నాయి. తమిళ అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడయ్యారు. లింగుస్వామి దర్శకత్వం వహించిన తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘ది వారియర్’. హీరో రామ్ ఫస్ట్‌టైమ్ పోలీస్ పాత్రను పోషించడంతో ఈ సినిమా నిర్మాణం నుంచే ఆసక్తిని పెంచింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాల్ని ఏ మేరకు అందుకుందో చూద్దాం..
కథేమిటంటే:
సత్య (రామ్) వైద్య విద్యార్థి. ఏంబీబీఎస్ పూర్తి చేసుకొని కర్నూల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌గా సేవలందించడానికి వస్తాడు. అక్కడి లోకల్ డాన్ గురు (ఆది) పోలీస్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకొని అనేక అరాచకాలకు పాల్పడుతుంటాడు. వీటిని ప్రశ్నించిన సత్యపై పగ పెంచుకుంటాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వైరం పెరుగుతుంది. ఓ డాక్టర్‌గా గురు అన్యాయాలపై తిరగబడలేనని తెలుసుకున్న రామ్ పోలీస్ అధికారిగా కర్నూల్ వస్తాడు. తనకు జరిగిన అన్యాయానికి అతను ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అక్కడి రేడియో జాకీ విజిల్ మహాలక్ష్మీ (కృతిశెట్టి)తో అతని ప్రేమాయణం ఏమిటి? అన్నదే మిగతా చిత్ర కథ..
ఎలా ఉందంటే:
కమర్షియల్ చిత్రాల్లో రివేంజ్ డ్రామాలు, వ్యవస్థను సంస్కరించే కథానాయకుల కథలు రొటీన్‌గా కనిపిస్తుంటాయి. అయితే ఈ కథల్ని ఎంత కొత్తగా చెబుతున్నాం..ప్రేక్షకుల్ని ఎలా ఎంగేజ్ చేస్తున్నామన్నదే సినిమా విజయాన్ని నిర్ణయిస్తుంది. ‘ది వారియర్’ రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఎలాంటి ట్విస్టులు, మలుపుల జోలికి పోకుండా దర్శకుడు లింగుస్వామి స్ట్రెయిట్ నరేషన్లో కథ రాసుకున్నారు. తనదైన స్టెలిష్ మేకింగ్, పతాకస్థాయిలో హీరోయిజాన్ని ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకులకు కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందివ్వడానికి ప్రయత్నించాడు.
సినిమా మొదలైన తొలి పదిహేను నిమిషాల్లోనే కథాగమనం ఎలా ఉండబోతుంది? హీరో సాధించే లక్ష్యం ఏమిటో కూడా తెలిసిపోతుంది. అయితే ప్రథమార్థాన్ని నాయకానాయికల లవ్‌ట్రాక్, హీరోకు తన తల్లితో (నదియా) ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ చక్కటి సన్నివేశాల్ని అల్లుకున్నారు. మెడికల్ మాఫియాతో ప్రతినాయకుడు గురు కుమ్ముక్కై కల్తీ ఔషదాల్ని తయారుచేయడం, దానివల్ల కొందరు పిల్లలు మరణించడంతో కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అప్పటి వరకు వైద్యుడిగా అండర్‌ప్లే చేసిన హీరో పాత్ర ప్రతిఘటనకు సిద్ధమవుతుంది. అక్కడి నుంచి ప్రతినాయకుడు గురుతో సత్య పోరాటానికి సిద్ధపడతాడు. ఈ క్రమంలో ఇంటర్వెల్‌కు ముందే ఖాకీ పాత్రను రివీల్ చేశారు. అయితే ఈ సినిమా పోలీస్ కథ అని ప్రేక్షకులకు ముందే అవగాహన ఉండటంతో ప్రేక్షకులకు ఆ ట్విస్ట్ ఏమంత థ్రిల్‌ను ఇవ్వలేక పోయింది.
సెకండాఫ్‌లో కథ వేగాన్ని అందుకుంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఐపీఎస్ రూపంలో కర్నూల్లో అడుగుపెట్టిన సత్య, గురు తాలూకు మనషులకు చెక్ పెట్టడం, ముఖాముఖీ పోరాటానికి తలపడటం ఆసక్తిని పంచింది. ఈ ఎపిసోడ్స్‌లో దర్శకుడు లింగుస్వామి తనదైన మార్క్‌ను ప్రదిర్శించాడు. సాత్వికుడైన డాక్టర్ పోలీస్‌గా ఉగ్రుడై కనిపిస్తే ఎలా ఉంటుందో అనే అంశాన్ని తనదైన మాస్ టచ్‌తో లింగుస్వామి తెరపై తీసుకొచ్చాడు. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాల్లో హీరోయిజం ఎలివేషన్స్ ఆకట్టుకున్నా.. కథ మొత్తం ప్రేక్షకులకు ఊహకు అందేలా సాగడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఇక క్లెమాక్స్ ఘట్టాల్ని కూడా సాదాసీదాగా ముగించారు. హీరో డాక్టర్ కాబట్టి ప్రతినాయకున్ని అంతమొందించకుండా వదిలివేశాడని చూపిస్తూ పాత్ర ఔచిత్యాన్ని ఆవిష్కరించారు దర్శకుడు లింగుస్వామి. ప్రాణం తీసేవారికి ప్రాణం విలువ తెలియజేయాలనే ఓ డాక్టర్ టర్న్డ్ పోలీస్ కథగా ఈ సినిమాకు ముగింపు నిచ్చారు. ఇది పక్కా రోటీన్ కథ అయినా ట్రీట్మెంట్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేదనిపిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్:
ఈ సినిమా మొత్తం హీరో రామ్, విలన్ ఆది మధ్య ఓ టఫ్ఫైట్గా సాగుతుంది. రామ్ తొలిసారి పోలీస్ పాత్రను పోషించినా…పవర్‌ఫుల్‌గా కనిపించారు. శరీరాకృతిని కడా తీర్చిదిద్దుకున్నాడు. ఐపీఎస్ సత్యగా రామ్ ఎనర్జీ లెవల్స్ బాగున్నాయి. డాక్టర్‌గా, పోలీస్‌గా భిన్న వైరుధ్యాలున్న పాత్రలకు రామ్ న్యాయం చేశాడు. ఆయన లుక్స్ కూడా బాగున్నాయి. ఇక పాటల్లో తనదైన శైలి నృత్యాలతో మెప్పించాడు. ఇక ప్రతినాయకుడు గురు పాత్రలో ఆది నటన బాగుంది. చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. కథానాయిక కృతిశెట్టి పాత్రకు అంతగా ప్రాధాన్యత దక్కలేదు. ఫస్టాఫ్ లవ్‌ట్రాక్ మినహయిస్తే ద్వితీయార్థంలో ఆమె కేవలం పాటల కోసమే ఉందనే భావన కలుగుతుంది. పోసాని కృష్ణమురళి, నదియా, జయప్రకాష్ తమదైన పరిధుల్లో నటించి మెప్పించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఆకట్టుకుంది. ముఖ్యంగా బుల్లెట్, విజిల్ పాటలు హుషారెత్తించేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. లవ్సాంగ్స్లో ఫీల్‌ను ఛాయాగ్రహణం చక్కగా ఎలివేట్ చేసింది. ఇక నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. నాణ్యత విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. దర్శకుడు లింగుస్వామి తనదైన మార్క్‌తో ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను తీర్చిదిద్దారు. అయితే ఆయనలో మునుపటి పదును ఎక్కడో మిస్ అయినట్లు అనిపిస్తుంది. సాయిమాధవ్ బుర్రా, లింగుస్వామి సంభాషణలు అక్కడక్కడా మెరిశాయి.
తీర్పు:
‘ది వారియర్’ ఫక్తు కమర్షియల్ ఎంటర్టైనర్. కథ రొటీన్‌గా అనిపించినా..రెండు వేరియేషన్స్‌తో సాగే రామ్ పాత్ర మెప్పిస్తుంది. కమర్షియల్ యాక్షన్ చిత్రాల్ని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.
రేటింగ్: 2.75/5