Nani | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల మంచి విజయాలతో దూసుకుపోతున్న ఆయన.. దర్శకుల ఎంపికలో కూడా ఎంతో జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల, సుజీత్, సీబీ చక్రవర్తి వంటి టాలెంటెడ్ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ బ్లడీ రోమియో షూటింగ్ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా ది పారడైజ్ చిత్రం నిలుస్తోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. సినిమా అవుట్‌పుట్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ మరింత సమయం తీసుకుంటున్నట్లు సమాచారం.
మొదట ఈ సినిమాను 2026 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ.. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే కారణంతో విడుదల తేదీని ఆగస్టు 21కి మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని తన పూర్తి కాల్ షీట్స్‌ను, ఫోకస్‌ను ఈ ప్రాజెక్టుకే కేటాయించాల్సి రావడంతో బ్లడీ రోమియో ప్రారంభానికి బ్రేక్ పడింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో లేదా 2027లోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నాని డేట్స్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి రావడంతో దర్శకుడు సుజీత్ తన ప్రణాళికల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఇక బ్లడీ రోమియో ఆలస్యమవుతున్న నేపథ్యంలో సుజీత్ తన దృష్టిని ఇప్పుడు OG 2 స్క్రిప్ట్‌పై కేంద్రీకరించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన OG భారీ హిట్ కావడంతో.. దానికి సీక్వెల్‌గా మరింత పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కథను సిద్ధం చేస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ లాక్ చేసే పనుల్లో బిజీగా ఉన్న సుజీత్.. నాని అందుబాటులోకి వచ్చిన వెంటనే బ్లడీ రోమియోను పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో సినిమా ఆలస్యమైనా.. కంటెంట్ విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు నాని వరుసగా విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ తన మార్కెట్‌ను పాన్ ఇండియా స్థాయికి విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. యాక్షన్, ఎమోషన్, ఇంటెన్స్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన.. రాబోయే ప్రాజెక్టులతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.