Nana Patekar | భారతీయ సినీ పరిశ్రమలో తన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు నానా పటేకర్. దశాబ్దాలుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులపై తనదైన ముద్ర వేసిన ఆయన ఇక లేరనే వార్త సినీ వర్గాలను విషాదంలో ముంచెత్తింది. నానా పటేకర్ వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి కొంతవరకు తెలిసినా.. ఆయన భార్య నీలకంటి పటేకర్ గురించి మాత్రం పెద్దగా తెలియదు. అయితే ఆమె కేవలం ప్రముఖ నటుడి భార్య మాత్రమే కాదు.. నటన, నాటకరంగంతో పాటు చదువులోనూ అద్భుతమైన ప్రతిభ కనబరిచిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. పుణేకు చెందిన నీలకంటి చిన్నతనం నుంచే చదువులో ఎంతో ప్రతిభావంతురాలిగా ఉండేవారని చెబుతారు. దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటిగా భావించే ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఆమె ర్యాంక్ సాధించారు. దీంతో ఇంజనీరింగ్ లేదా శాస్త్ర సాంకేతిక రంగంలో మంచి భవిష్యత్తును ఎంచుకునే అవకాశం ఆమె ముందు ఉంది.
అయితే నీలకంటి మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. చిన్నప్పటి నుంచే నాటకాలు, నటనపై ఉన్న ఆసక్తితో కళారంగం వైపు అడుగులు వేశారు. మంచి ఉద్యోగం, ఆర్థికంగా స్థిరమైన కెరీర్ కంటే తనకు ఇష్టమైన నాటకరంగానికే ప్రాధాన్యత ఇచ్చారు.సినిమాల్లోకి రాకముందు నీలకంటి మరాఠీ నాటకరంగంలో చురుగ్గా పనిచేశారు. 1973లో జరిగిన మహారాష్ట్ర రాష్ట్ర నాటక పోటీల్లో ఉత్తమ నటిగా బంగారు పతకాన్ని అందుకున్నారు. ఆ తర్వాత కూడా రంగస్థలంపై తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1989లో సచిన్ పిల్గాంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆత్మవిశ్వాస్’ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో ఆమె ప్రదర్శించిన నటనకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి పురస్కారం లభించింది. ఇలా నీలకంటి తన నటనా ప్రతిభను కేవలం నాటకరంగానికే పరిమితం చేయకుండా సినిమాల్లోనూ నిరూపించుకున్నారు.
నానా పటేకర్, నీలకంటి పటేకర్ల పరిచయానికి కూడా నాటకరంగమే కారణమైంది. ఇద్దరూ థియేటర్లో పనిచేసే సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 1978లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అప్పట్లో తమ పెళ్లిని ఎంతో సాధారణంగా చేసుకున్నారని సమాచారం. కేవలం రూ.750 ఖర్చుతోనే వివాహం చేసుకున్నారని చెబుతారు. అయితే వివాహం అనంతరం వారి జీవితంలో విషాదం చోటుచేసుకుంది. మొదటి కుమారుడు రెండున్నరేళ్ల వయసులోనే కన్నుమూయడంతో నానా పటేకర్, నీలకంటి తీవ్ర విషాదాన్ని ఎదుర్కొన్నారు. అనంతరం వారికి మల్హర్ పటేకర్ అనే కుమారుడు జన్మించారు. కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడంతో నీలకంటి చాలా కాలం పాటు నటనకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల ‘ఛావా’ సినిమాతో ఆమె మళ్లీ వెండితెరపై కనిపించారు. విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చారిత్రక చిత్రంలో నీలకంటి ‘ధరావు’ పాత్రలో కనిపించారు.చాలా సంవత్సరాల తర్వాత తెరపైకి వచ్చినప్పటికీ ఆమె నటనకు మంచి స్పందన లభించింది. దీంతో నీలకంటి మరోసారి తనలోని నటనా ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేశారు.