‘ఇలాంటి మైథలాజికల్ జోనర్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. స్క్రిప్ట్ విన్నప్పుడు గొప్ప చిత్రమవుతుందనే భావన కలిగింది. నా కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు అక్కినేని నాగచైతన్య. ఆయన నటించిన తాజా చిత్రం ‘వృషకర్మ’. మిథికల్ థ్రిల్లర్ కథాంశమిది. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకుడు. గురువారం చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాలో నాగచైతన్య నిధి అన్వేషకుడి పాత్రలో కనిపించనున్నారు. ‘ఆతీంద్రియ శక్తులు మేల్కొన్నప్పుడు.. సృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది’ అనే వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సినిమాలోని 30 నిమిషాల ైక్లెమాక్స్ ఘట్టాలు ఇండియన్ సినిమాలో బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తాయని నాగచైతన్య అన్నారు.
ఈ సినిమాలో నాగచైతన్య మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తారని దర్శకుడు కార్తీక్ దండు పేర్కొన్నారు. మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ, జయరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల, నిర్మాతలు: బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి, దర్శకత్వం: కార్తీక్ దండు.