Megastar ChiranJeevi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎంతో కాలంగా మనవడు, మనవరాలి కోసం ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఈ వార్తతో తన కల నెరవేరినట్లయింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని అపోలో ఆసుపత్రి వద్ద మెగాస్టార్ మీడియా సమావేశం నిర్వహించి తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ఇంట్లోకి ఇద్దరు వారసులు రావడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోందని, తల్లి ఉపాసనతో పాటు ఇద్దరు బిడ్డలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వెల్లడించారు. ఉపాసనకు విజయవంతంగా ప్రసవం చేసిన వైద్య బృందానికి చిరంజీవి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబాన్ని ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “మా ఇంట్లో ఈ శుభం జరగాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం, ఈ రోజు అది సాకారమైంది” అంటూ చిరంజీవి ఆనంద బాష్పాలతో ముగించారు.