Kiran Abbavaram | యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా తిరుపతిలో నిర్వహించిన ‘జిగితార’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా మాట్లాడిన కిరణ్ అబ్బవరం, ‘క’ సినిమా మంచి విజయాన్ని సాధించిందని, ‘కె ర్యాంప్’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నామని, ఇప్పుడు ‘చెన్నై లవ్ స్టోరీ’ కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని పూర్తి నమ్మకంతో చెప్పారు.
‘చెన్నై లవ్ స్టోరీ’లో తన పాత్ర ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుందని కిరణ్ తెలిపారు. ఈ సినిమా కథ విన్నప్పుడు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తొచ్చాయని, ఆ కారణంగా ఈ కథతో చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యానని చెప్పారు. ఈ సినిమా నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసింది. చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాను. ప్రేక్షకులు కూడా ఈ కథకు కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను అని కిరణ్ పేర్కొన్నారు. సినిమాలోని ‘జిగితార’ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కిరణ్ అబ్బవరం తెలిపారు. సినిమా 30వ నిమిషంలో వచ్చే ఈ పాట ప్రేక్షకులకు గూస్బంప్స్ కలిగిస్తుందని ఆయన అన్నారు.
అంతేకాకుండా సినిమాలోని డైలాగ్స్ చాలా కాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయని, ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే పది నిమిషాల ఎమోషనల్ సీక్వెన్స్‌కు థియేటర్లలో భారీగా చప్పట్లు పడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న మణిశర్మపై కూడా కిరణ్ ప్రశంసలు కురిపించారు. “మణిశర్మ గారి సంగీతం అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం నేను కూడా అభిమానుల్లాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని చెప్పారు. అలాగే పాటల రచయిత అనంత శ్రీరామ్ రాసిన ప్రతి పాట కూడా అద్భుతంగా వచ్చిందని, సాహిత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన ‘మ్యాడ్’ ఫేమ్ గౌరీ ప్రియ హీరోయిన్గా నటించారు. ఆమె నటన ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని కిరణ్ పేర్కొన్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. తనపై ప్రేమ చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన కిరణ్, భవిష్యత్తులో “కిరణ్ అన్న అభిమాని” అని చెప్పుకునేలా తాను మంచి సినిమాలు చేస్తానని హామీ ఇచ్చారు.