‘ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ప్రేమకథలోని సంఘర్షణతో పాటు కుటుంబ భావోద్వేగాలు అందరికి కనెక్ట్ అవుతాయి. మధ్యతరగతి యువకుడి ప్రయాణం, అతను తండ్రితో జరిపే సంభాషణ..ఇవన్నీ నా మనసుకు దగ్గరయ్యాయి’ అన్నారు హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా థాంక్స్‌మీట్ నిర్వహించారు. టీమ్ అంతా కలిసి నిజాయతీగా చేసిన ప్రయత్నం ఫలించిందని ఆనంద్ దేవరకొండ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా చూసిన చాలా మంది యూత్ తెరపై తమను తాము చూసుకుంటున్నట్లుగా ఉందని మెసేజ్‌లు పెడుతున్నారని, అమ్మాయిలకు ఈ కథ బాగా నచ్చుతున్నదని కథానాయిక వైష్ణవిచైతన్య పేర్కొన్నది. ‘ఈ సినిమా యూత్‌కు బాగా నచ్చుతున్నది. త్వరలో సీక్వెల్ ప్లాన్ చేస్తాం. కమర్షియల్ లెక్కలు వేసుకొని చేసిన సినిమా కాదిది. మనసుకు నచ్చి చేశాను. మహిళా ప్రేక్షకులు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం ఆనందంగా ఉంది’ అని సూర్యదేవర నాగవంశీ అన్నారు. తాను జీవితంలో చూసిన సంఘటనల నుంచే ఈ కథ రాసుకున్నానని, సినిమాటిక్‌గా వెళ్లకుండా సహజంగా కథ చెప్పానని దర్శకుడు ఆదిత్యహాసన్ పేర్కొన్నారు.