Hey Balwanth OTT | టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ హే బల్వంత్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 సొంతం చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రావడం విశేషం. హిందీ వెర్షన్ కూడా త్వరలోనే మరో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దర్శకుడు గోపి అచ్చర తెరకెక్కించిన ఈ చిత్రంలో నరేష్, వెన్నెల కిశోర్, అన్నపూర్ణమ్మ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా, సంగీతాన్ని సాగర్ అందించారు. కథ ఏంటంటే.. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన కృష్ణ (సుహాస్) తన తాత (నరేష్) మరియు నాన్నమ్మ (అన్నపూర్ణమ్మ) సంరక్షణలో పెరుగుతాడు. తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని, పెద్దయ్యాక ఆయన బిజినెస్‌ను అభివృద్ధి చేయాలనుకుంటాడు.
అయితే అనుకోని పరిస్థితుల్లో ఆ బిజినెస్ బాధ్యతలు తన చేతిలోకి వచ్చిన తర్వాత, ఆ వ్యాపారం వెనుకున్న నిజాలు తెలుసుకుని కృష్ణ షాక్‌కు గురవుతాడు. ఈ క్రమంలో అతని ప్రేమ జీవితం కూడా ప్రభావితమవుతుంది. తన ప్రేయసి మిత్ర (శివానీ నాగారం)తో దూరమవ్వాల్సిన పరిస్థితులు, బిజినెస్ వెనుక ఉన్న రహస్యాలు, అనుకోని సంఘటనలు అన్నీ కలిపి కథను ఆసక్తికరంగా మలుస్తాయి. థియేటర్లలో మిక్స్డ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం, ఓటీటీ ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ మూవీ డిజిటల్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని మేకర్స్ ఆశిస్తున్నారు.