Gang Leader Movie Re-Release | పాత సినిమాలకు 4K పౌడర్ రుద్ది రీ-రిలీజ్లంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గతనెల రోజుల నుండి వీటి హవా తగ్గింది కానీ మళ్లీ ఇప్పుడు రీ స్టార్ట్ అయింది. చిరంజీవి ఎవర్ గ్రీన్ హిట్లలో ‘గ్యాంగ్‌లీడర్’ ఒకటి. విజయ్ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథకు కమర్షియల్ హంగులను జోడించి బాక్సాఫీస్‌పై తిరుగులేని విజయాన్ని నమోదు చేశాడు దర్శకుడు బాపినీడు. బప్పి లహరి సంగీతానికి బట్టలు చింపుకుని చిందులేసిన చిరు అభిమానులు ఎందరో.
పాప రీటా, వాన వాన వెల్లువాయే, భద్రాచలం వంటి పాటలకు ముసలి, ముతక అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు హమ్ చేసేవారు. ఈ సినిమా ఆల్బమ్‌తో లహరి ఆడియో క్యాసెట్ కంపెనీకి అప్పట్లోనే లక్షల రూపాయల లాభం వచ్చింది. ఇక విజయ్ శాంతి-చిరు కెమెస్ట్రీ, కిక్కిచ్చే డ్యాన్స్‌లు, లవ్ సీన్స్, విజిల్ వేయించే ఫైట్ సీన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక కంప్లీట్ మాస్ ప్యాకేజీ ఈ సినిమా. అలాంటి బ్లాక్‌బస్టర్ సినిమా ఇప్పుడు రీ-రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 11న ఈ సినిమాను పెద్ద ఎత్తులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇప్పటికే ఈ సినిమాను యూట్యూబ్‌లో, టీవీల్లో బోలెడన్ని సార్లు చూసేశాం. ఆ మధ్య కూడా ‘ఘరానా మొగుడు’ సినిమాను రీ-రిలీజ్ చేస్తే కనీసం థియేటర్ రెంటుకు సరిపడా కలెక్షన్లను కూడా వెనక్కి తీసుకరాలేకపోయింది. మరి ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తే ప్రేక్షకులను ఆదరిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కేవలం ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్‌ను క్యాష్ చేసుకోవడానికి మాత్రమే ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి తోడు ఈ సినిమా ముందు రోజు కళ్యాణ్‌రామ్ ‘అమిగోస్’ విడులవుతుంది. ఇప్పటికైతే ఈ సినిమాపై అంతగా అంచనాలు లేవు. కానీ ‘బింబిసార’ లాగా మౌత్ టాక్‌తో జనాలను ఆకర్షిస్తే గ్యాంగ్‌లీడర్ సినిమాను పట్టించుకునే నాథుడే ఉండడు.