అగ్ర హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ కాంబినేషన్లో సినిమా మొదలైన నాటినుంచి అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా అప్డేట్స్, విడుదల తేదీ కోసం అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారందరి ఎదురు చూపులకు స్వస్తి పలుకుతూ ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ డేట్ల వివరాలను మంగళవారం మేకర్స్ ప్రకటించారు. ‘ఎన్టీఆర్‌నీల్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ఈ ఏడాది మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఆ గ్లింప్స్ ద్వారా ఓ శక్తివంతమైన సినిమాటిక్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
అలాగే, జూన్ 11, 2027న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో నీడలా కనిపిస్తున్న ఎన్టీఆర్‌ని చూడొచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళంతో సహా పలు భాషల్లో పానిండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ అత్యంత శక్తివంతమైన పాత్రతో మెప్పిస్తారని, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు సైతం ఇందులో ఆకట్టుకునేలా ఉంటాయని మేకర్స్ తెలిపారు. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అనిల్‌కపూర్ కీలక పాత్రధారి. ఈ చిత్రానికి కెమెరా: భువన్ గౌడ, సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు, నిర్మాణం: మైత్రీ మూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్.