Disha Patani | బాలీవుడ్లో తన గ్లామర్‌తో పాటు నటనతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ దిశా పటాని ఇప్పుడు తన కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇకపై వైవిధ్యమైన, బలమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ఇప్పటివరకు నేర్చుకున్న విషయాలు, భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటోందనే అంశాలపై దిశా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
దిశా పటాని తొలిసారిగా ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. ఈ పదేళ్లలో నటిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని దిశా తెలిపింది. విభిన్నమైన అనుభవాలు తనను మరింత పరిణతి చెందిన నటిగా తీర్చిదిద్దాయని చెప్పింది. ఇప్పటివరకు తాను ఎక్కువగా గ్లామర్‌కు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించినప్పటికీ, ఇకపై తన కెరీర్లో కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది.
సినిమా పరిశ్రమలో గ్లామర్‌తో గుర్తింపు తెచ్చుకోవడం ఒక ఎత్తయితే, నటిగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించడం మరో ఎత్తు. ఈ విషయాన్ని దిశా పటాని కూడా గుర్తించినట్లు ఆమె వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఇకపై ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా, తనలోని నటనా ప్రతిభను బయటపెట్టే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. కేవలం తెరపై అందంగా కనిపించడమే కాకుండా, కథలో కీలక పాత్ర పోషించే క్యారెక్టర్లు చేయాలని ఉందని దిశా తెలిపింది. ప్రేక్షకులు తన పాత్రతో భావోద్వేగపరంగా అనుసంధానమయ్యేలా ఉండాలని, కథను ముందుకు తీసుకెళ్లడంలో ఆ పాత్రకు ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దిశా పటాని ‘హోలీగార్డ్స్ సాగా: ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. భారతీయ సినిమాలతో పాటు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఆమెకు ఈ చిత్రం కెరీర్లో మరో కీలక అడుగు కానుంది.