ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్, పోలీస్ బయలుదేరాడురా..’అనే డైలాగ్‌తో కట్ చేసిన ‘అల్లూరి’ టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్నారు. ఈ టీజర్లో నేరస్తులను వెంటాడే పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో విష్ణు కనిపించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కయాదు లోహర్ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. సోమవారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవిష్ణు మాట్లాడుతూ..‘సైనికులు, పోలీసులు, వైద్యులు ఈ ముగ్గురు నా దృష్టిలో నిజమైన హీరోలు.
ఓ మంచి పోలీస్ స్టోరీలో నటించాలనే నా కోరిక ఈ చిత్రంతో నెరవేరింది. దర్శకుడు ప్రదీప్లోని ఆవేశమే అల్లూరి పాత్ర. ఈ సినిమాలో నటించిన తర్వాత నేనెందుకు పోలీస్ కాలేకపోయాను అని అనిపించింది’ అన్నారు. ‘ఈ సినిమా చూసొచ్చాక పోలీస్‌లకు సెల్యూట్ చేస్తారు. 16 ఏళ్ల సర్వీస్‌లో ఓ నిజాయితీ గల పోలీస్ అధికారి సమాజం కోసం ఏం చేశాడు అనేది సినిమాలో చూపిస్తున్నాం’ అని దర్శకుడు ప్రదీప్ వర్మ అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ…‘ఇదొక ఫిక్షనల్ బయోపిక్. వాస్తవ ఘటనల ఆధారంగా నిర్మించాం. మా సంస్థలో నిర్మితమైన సినిమాల్లో ‘అల్లూరి’ ప్రత్యేకమైంది. ఈ సినిమా చేసినందుకు నిర్మాతగా గర్వపడుతున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో శివాజీ, తేజ సజ్జా, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట తదితరులు పాల్గొన్నారు.