‘ఈ సినిమాలో రామ్‌చరణ్ కనిపించరు. తెరపై ‘పెద్ది’ మాత్రమే కనిపిస్తాడు. ఆట నుంచి పెద్ది ఏం నేర్చుకున్నాడు?
ఆట అతనికి ఏమిచ్చింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం’ అంటున్నారు దర్శకుడు బుచ్చిబాబు సానా.‘ఉప్పెన’ తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. రామ్‌చరణ్ కథానాయకుడిగా వెంకట సతీశ్ కిలారు నిర్మించిన ఈ చిత్రం రేపు (గురువారం) థియేటర్లలో విడుదల కానున్నది.ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో ముచ్చటించారు బుచ్చిబాబు సానా. ఆ వివరాలివి..
ప్రస్తుతం ‘పెద్ది’ విజయం పరిశ్రమకు అవసరం. నా ‘ఉప్పెన’ విషయంలోనూ ఇదే జరిగింది. అది కోవిడ్ టైమ్. థియేటర్లకు జనం రావడం కష్టం అనుకున్నాం. కానీ వచ్చారు. హిట్ చేశారు. ‘ఉప్పెన’ వచ్చిన అయిదేళ్లకు ‘పెద్ది’తో వస్తున్నా. సాధారణంగా ఒక బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడికి అయిదేళ్ల సమయం పట్టడం జరగదు. కానీ నా విషయంలో జరిగింది. ‘ఉప్పెన’ విడుదలైన రెండున్నరేళ్లకు మా గురువుగారు సుకుమార్ నన్ను రామ్‌చరణ్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆయనకు కథ నచ్చింది. ఏడాదిన్నరలో షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇది క్రీడా నేపథ్య చిత్రం కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సివచ్చింది. క్రికెట్ అంటే అందరికీ తెలుసుకానీ, కుస్తీపై అంత అవగాహన మనవాళ్లకు ఉండదు. అందుకే దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ‘దంగల్’లో అమీర్‌ఖాన్‌కి కోచింగ్ ఇచ్చిన ట్రైనర్‌ని తెచ్చి చరణ్‌కి ట్రైనింగిప్పించాం. నాలుగు నెలలు ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు.
ఇందులో శివరాజ్కుమార్ది ఆటను బతికించేవాడి పాత్ర. రామ్‌చరణ్ గురువుగా కనిపిస్తారాయన. ఇక జగపతిబాబు నటించిన అప్పలసూరి పాత్ర అయితే.. రామ్‌చరణ్ పాత్ర తర్వాత అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. దివ్యేందు పాత్ర క్రేజీగా ఉంటుంది. జాన్వీకపూర్ సినిమాకు ప్రత్యేకమైన కలర్ తీసుకొచ్చింది. ఇందులో చరణ్, జాన్వీల లవ్‌ట్రాక్ చాలా బాగుంటుంది. పాతిక కోట్లతో ‘ఉప్పెన’ తీశాను. కానీ ‘పెద్ది’కి 350కోట్లు అయ్యింది. రామ్‌చరణ్ స్థాయి హీరో నటించినప్పుడు బడ్జెట్ ఆ స్థాయిలో ఉండటం సహజం. ఈ సినిమా పాటలు, ఆర్ఆర్ విన్నాక, ఏఆర్ రెహమాన్గారితోనే లైఫ్‌లాంగ్ సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా విడుదల కాని రెండు పాటలున్నాయి. అవి అదిరిపోతాయి. అందరూ ఈ సినిమాను మా గురువుగారి ‘పుష్ప’తో కంపేర్ చేస్తున్నారు. వారికి నేను చెప్పేదొక్కటే. పుష్పరాజ్ మైండ్‌లో ఉంటాడు.. పెద్ది ప్రేక్షకుల్లో గుండెల్లో ఉంటాడు.
ఈ సినిమా షూట్లో రామ్‌చరణ్‌కి చాలా గాయాలయ్యాయి. ముఖ్యంగా రెజ్లింగ్ సన్నివేశాల్లో దెబ్బలు బాగా తగిలాయి. ఓ ఫైట్ సీన్లో పొరపాటున కంటికి గాయమై రక్తం కారుతుంటే చిరంజీవిగారు తిడతారేమోనని భయపడ్డా. అది కెమెరాలో కూడా రికార్డయింది. చిరంజీవిగారికి ఆ విషయం తెలిసి, ‘బుచ్చి.. వీడియో పంపు’ అన్నారు..(నవ్వుతూ). ‘పెద్ది’ మూడు దశలుగా ఉంటుంది. ప్రతి దశకు ఓ లుక్‌ని ఏఐలో డిజైన్ చేశాం. మేం డిజైన్ చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా చరణ్ ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ‘పెద్ది’లో స్పోర్ట్స్ ఎమోషన్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా పెద్ద కథ ఉంటుంది. ఒక 15 నిమిషాలు మెయిన్ ఎమోషనల్ బ్లాక్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ ఆడియన్స్‌ని ఉద్వేగానికి లోను చేస్తుంది. ఇక ైక్లెమాక్స్ అయితే నెక్ట్స్ లెవల్. మొత్తంగా ‘పెద్ది’ ఎమోషనల్‌గా సాగే ఓ గ్రేట్ కమర్షియల్ మూవీ.