Deepika Padukone | బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొనే మరియు రణవీర్ సింగ్ తమ అభిమానులకు మరోసారి తీపి కబురు అందించారు. ఆదివారం ఉదయం ఇన్స్టాగ్రామ్ వేదికగా దీపికా పదుకొనే తన రెండో గర్భాన్ని ధృవీకరిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలో తన కూతురు దూవా(Dua) పదుకొనే సింగ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ను పట్టుకున్న ఒక క్యూట్ ఫోటోను షేర్ చేసిన దీపికా, 2024 సెప్టెంబర్‌లో జన్మించిన దూవా ఇప్పుడు పెద్దక్క కాబోతోందని పరోక్షంగా వెల్లడించారు. ఎటువంటి సుదీర్ఘ సందేశాలు లేకుండా కేవలం ‘దిష్టి చుక్క’ ఎమోజీలను మాత్రమే క్యాప్షన్‌గా పెట్టిన ఈ పోస్ట్‌పై సినీ ప్రముఖులు సమంత, భూమి పెడ్నేకర్‌తో పాటు వేలాది మంది అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి దీపికా-రణవీర్ దంపతులు తమ జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుండటంతో అటు కుటుంబ సభ్యుల్లోనూ, ఇటు అభిమానుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.