Chiranjeevi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా రామ్ చరణ్‌ను “న్యూ ఏజ్ మెగాస్టార్”గా అభివర్ణించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇటీవల జరిగిన జాతీయ మీడియా కాంక్లేవ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రామ్ చరణ్ పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసిన చిరంజీవి, అక్కడ పలువురు చరణ్‌ను భవిష్యత్ మెగాస్టార్‌గా అభివర్ణించారని తెలిపారు.
ఇకపై రామ్ చరణ్ ముందుంటాడు.. నేను అతని వెనకాల ఉంటాను. ఒక తండ్రిగా ఇది పుత్రోత్సాహంతో చెబుతున్న మాట. చరణ్ సాధించిన స్థాయి చూసి గర్వంగా ఉంది అని చిరంజీవి భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ నటన గురించి మాట్లాడుతూ, సినిమా చూస్తున్నంతసేపు చరణ్ కనిపించలేదు.. కేవలం పెద్ది మాత్రమే కనిపించాడు. ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయి ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లాడు. మేమంతా కూడా పెద్ది పాత్రతో ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాం అని అన్నారు. ఈ సినిమా కోసం చరణ్ చేసిన కఠోర శ్రమ గురించి కూడా చిరంజీవి వివరించారు. ఉదయం, సాయంత్రం గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేశాడని, షూటింగ్ ముగించుకుని వచ్చిన తర్వాత కూడా తిరిగి వ్యాయామం చేసేవాడని చెప్పారు. “ఎందుకింత కష్టపడుతున్నావని అడిగితే, రేపు షూటింగ్లో ఎనర్జీగా ఉండాలంటే ఇది అవసరమని చెప్పేవాడు” అంటూ తన కుమారుడి అంకితభావాన్ని గుర్తు చేశారు.
‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని, కానీ ‘పెద్ది’లో ఆ నటనను కూడా అధిగమించాడని చిరంజీవి అభిప్రాయపడ్డారు. రంగస్థలం తర్వాత మళ్లీ అలాంటి పాత్ర చరణ్‌కు రావడానికి చాలా సమయం పడుతుందని అనుకున్నాను. కానీ ఇంత త్వరగా ‘పెద్ది’లాంటి పాత్ర రావడం అతని అదృష్టం. ఆ పాత్రను పూర్తిగా నమ్మి, దర్శకుడిని విశ్వసించి, కథకు అంకితమై పనిచేయడం వల్లే ఈ స్థాయి నటన సాధ్యమైంది అని తెలిపారు. నటన గురించి మాట్లాడుతూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ కవళికలు, శరీర భాష మాత్రమే నటన కాదు. పాత్రలోని భావోద్వేగాన్ని స్వయంగా అనుభవించి, కళ్ల ద్వారా ప్రేక్షకులకు చేరవేయగలిగితేనే అది పరిపక్వమైన నటన అవుతుంది. ఈ రోజు రామ్ చరణ్‌లో అలాంటి పరిపక్వతను నేను చూశాను అని అన్నారు.